గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు జరగనున్న ఈ పరీక్షలకు... రాష్ట్రంలో 5 వేల 314 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా సామగ్రి తరలింపునకు పటిష్ఠమైన భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలలో 1 లక్షా 26 వేల 728 ఉద్యోగాల భర్తీకి జరగనున్న రాతపరీక్షకు... సుమారు 22 లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రాత పరీక్షా ఫలితాల్లో మెరిట్ ఆధారంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
లక్షకు పైగా సిబ్బంది విధులు
పరీక్షల నిర్వహణకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీల ప్రత్యక్ష పర్యవేక్షణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశామని ద్వివేది వెల్లడించారు. పరీక్షల నిర్వహణను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ, విద్యాశాఖ, యూనివర్సిటీల సాంకేతిక సహకారం తీసుకుంటోంది. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణలో భాగంగా ప్రశ్నాపత్రాలను తరలించేందుకు 1,174 రూట్లను గుర్తించింది. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు లక్షా 22వేల 554 మంది సిబ్బంది నియమించామని ద్వివేది తెలిపారు. జిల్లా స్థాయిల్లో మాస్టర్ ట్రైనర్స్ ద్వారా సిబ్బందికి శిక్షణ అందించామన్నారు. అభ్యర్థులను యాధృచ్ఛిక పద్ధతిలో(ర్యాండమ్లీ) వేరు వేరు పరీక్షా కేంద్రాలకు కేటాయించారు. పర్యవేక్షకులకు కూడా ఇదే పద్ధతి పాటించామని ద్వివేది తెలిపారు.
పరీక్ష రోజే 'కీ'
ఓ.ఎం.ఆర్ జవాబు పత్రం నకలును అభ్యర్ధులు తీసుకొనడానికి అనుమతి ఇవ్వనున్నట్లు గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. పారదర్శకతను పాటించడం కోసం పరీక్ష జరిగిన రోజునే 'కీ' ప్రచురిస్తామన్నారు. సీసీ టీవీ, వీడియో కెమెరాలను అవసరమైన చోట్ల వినియోగించడానికి జిల్లా కలెక్టర్లకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఏ పరిస్థితిలోనూ ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేదని ద్వివేది స్పష్టం చేశాకు.