southern zonal council meeting 2022: విద్యుత్ బకాయిలు, విభజన సమస్యలు, నీటిపారుదల అంశాలపై దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర వాదనలు బలంగా వినిపించాలని రాష్ట్ర బృందాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. రేపు కేరళ రాజధాని తిరువనంతరపురం వేదికగా కౌన్సిల్ 30వ సమావేశం జరగనుంది. విద్యుత్ బకాయిలు, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు, విభజన హామీలు సమావేశంలో ప్రస్తావనకు రానున్నాయి. హోంమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో రాష్ట్ర బృందం కౌన్సిల్ సమావేశానికి హాజరుకానుంది.
ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావడం లేదు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంతోపాటు తెరాస శాసనసభా పక్ష సమావేశం సైతం రేపే ఉండడంతో సీఎం వెళ్లడం లేదు. విభజన వ్యవహారాలు చూస్తున్న ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతోపాటు కౌన్సిల్ సమావేశం ఎజెండాలో ఉన్న నీటిపారుదల, విద్యుత్, హోంశాఖల నుంచి అధికారులు వెళ్లనున్నారు. విద్యుత్ బకాయిల అంశం చర్చకు రానుంది. తెలంగాణ డిస్కంల నుంచి 6700 కోట్లు రావాలని ఏపీ చెపుతుండగా ఆ మొత్తాన్ని నెల రోజుల్లోగా చెల్లించాలంటూ కేంద్ర విద్యుత్ శాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏపీ నుంచి తమకు రూ.12వేల కోట్ల విద్యుత్ బకాయిలు రావాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీంతో కౌన్సిల్ సమావేశంలో ఈ అంశం మరోమారు ప్రస్తావనకు రానుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించి నీటిపారుదల సంబంధిత అంశాలు సహా విభజన వివాదాలు, సమస్యలు సమావేశంలో ప్రస్తావనకు రానున్నాయి.
విభజన చట్టానికి సంబంధించిన అంశాలు, దిల్లీలో ఏపీభవన్ విభజన, తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజన, పన్నులో వ్యత్యాసం, పౌరసరఫరాల సంస్థల బకాయిలు సైతం ప్రస్తావనకు రానున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల సంబంధిత అంశాలు జోనల్ కౌన్సిల్ సమావేశంలో చర్చకు రానున్నాయి. తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంశం అజెండాలో ఉంది. కృష్ణా జలాల్లో తెలంగాణ న్యాయమైన వాటా తేల్చేందుకు ట్రైబ్యునల్‌కు నివేదించడంతోపాటు పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. మహిళలు, చిన్నారులపై లైంగికదాడుల కేసుల సత్వర పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానాలపై కౌన్సిల్ సమావేశం చర్చించనుంది. వివిధ అంశాలకు సంబంధించి రాష్ట్రం తరపున వినిపించాల్సిన వాదనలు, ప్రస్తావించాల్సిన అంశాలపై అధికారులకు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఇవీ చదవండి: