Some rules changed in YSR jalakala ఎన్నికల నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. నియోజకవర్గానికి ఒకటి వంతున బోర్లు తవ్వే 163 యంత్రాలను ఇస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 2 లక్షల బోర్లను తవ్వించడమే కాదు.. కేసింగ్ పైపులనూ ఇచ్చేకార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. వచ్చే 4 ఏళ్లలో ఈ పథకానికి రూ.2,340 కోట్లు ఖర్చు చేయబోతున్నామని గర్వంగా చెబుతున్నా. చిన్న, సన్నకారు రైతుల పొలాల్లో బోర్లు వేయించడమే కాదు. మోటార్లు బిగిస్తామని చెబుతున్నా. దీనికి ఉజ్జాయింపుగా మరో రూ.1,600 కోట్లు ఖర్చు భరించడానికి సిద్ధపడి ఈ ప్రకటన చేస్తున్నా. బోరు వేయడమే కాదు నీరు ఎక్కడ పడుతుందో గుర్తించేందుకు చేసే సర్వేకు అయ్యే ఖర్చునూ ప్రభుత్వమే భరిస్తుంది.
2020 అక్టోబరు 28న వైఎస్‌ఆర్ జలకళ పథకాన్ని ప్రారంభిస్తూ సీఎం జగన్ అన్న మాటలివి.
బోరు వేసుకుంటే తప్ప నీటి సదుపాయం లేని చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలుస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పింది. వైఎస్‌ఆర్ జలకళ కింద బోరు.. సబ్‌మెర్సిబుల్ మోటారు.. విద్యుత్ కనెక్షన్ ఉచితంగా ఇస్తామని చెప్పి ఆచరణలో చేతులెత్తేసింది. విద్యుత్ కనెక్షన్‌కు అయ్యే పూర్తి మొత్తాన్ని భరించడం ప్రభుత్వానికి సాధ్యం కాదని పేర్కొంటూ కొంత భారాన్ని రైతుపై మోపింది. 2020 అక్టోబరు 28న పథకాన్ని ప్రారంభించే సమయంలో నాలుగేళ్లలో 2 లక్షల బోర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అంటే ఏటా సుమారు 50వేల బోర్లు తవ్వాలి. పథకాన్ని ప్రకటించి 22 నెలలు గడిచాయి. ఇప్పటికే సుమారు లక్ష బోర్లు తవ్వాలి. వాటికి మోటార్లు.. విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలి. అయితే ప్రభుత్వం 2021-22 వరకు తవ్విన మొత్తం బోర్లు 6,555. వాటికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి అయ్యే వ్యయాన్ని డిస్కంలు ప్రతిపాదిస్తే అంత మొత్తం భరించడం సాధ్యం కాదంటూ ఒక్కొక్క రైతుకు రూ.2 లక్షలనే ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. దీంతో ఇప్పటికే పథకం కింద కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులపై రూ.48.63 కోట్ల భారం పడనుంది.
ఉచితమని ఊరించి..
వైకాపా అధికారంలోకి వచ్చాక తెదేపా హయాంలో అమలవుతున్న ఎన్‌టీఆర్ జలసిరి పథకాన్ని వైఎస్‌ఆర్ జలకళగా మార్చింది. ఎన్‌టీఆర్ జలసిరి కింద అప్పట్లో రైతులకు బోరు, సోలార్ పంపుసెట్‌ను తెదేపా ప్రభుత్వం అందించింది. దీనికి అయ్యే మొత్తం రూ.3.69 లక్షల ఖర్చులో రైతు వాటా కింద రూ.55వేలు చెల్లిస్తే మిగిలిన మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ రూపేణా అందించేవి. ఈ పథకాన్ని మార్పు చేసి రైతులకు బోరు, మోటారు.. విద్యుత్ కనెక్షన్ ఉచితంగా ఇస్తామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చింది. రైతుపై భారం పడేలా నిర్ణయం తీసుకుంది. దీంతో ఉచితం అని భావిస్తున్న రైతులు ఇప్పుడు రూ.లక్ష నుంచి రూ.3 లక్షలదాకా అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. కొందరికి ప్రభుత్వం ఇచ్చే సొమ్ముకు అదనంగా రూ.5 లక్షల వరకూ ఖర్చు చేస్తేనే మోటారు తిరిగే పరిస్థితి నెలకొంది.
దూరం పెరిగిందంటూ.. రైతులపై రూ.48 కోట్ల భారం
విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి పంపిణీ లైన్ల నుంచి రైతు పొలం వరకు ప్రత్యేకంగా విద్యుత్ స్తంభాలు, వైర్లు, ఇతర పరికరాలు అవసరం. దీనికోసం డిస్కంలు అంచనాలు రూపొందించాయి. కొందరు రైతుల పొలాలు దూరంగా ఉండటంతో అక్కడి వరకు విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడానికి ఎక్కువ స్తంభాలు వేయాలి. వైర్లు అదనంగా కావాలి. దీనికోసం అయ్యే ఖర్చులో ప్రభుత్వం ఇచ్చే రూ.2 లక్షలు పోగా అదనంగా అయ్యే మొత్తాన్ని రైతు భరించడానికి ముందుకు వస్తేనే కనెక్షన్ ఇస్తామని డిస్కంలు చెబుతున్నాయి. తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో దరఖాస్తు చేసుకున్న రైతుల్లో కేవలం 7.87 శాతం మందికే ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు పొందే అవకాశం ఉంది. సీపీడీసీఎల్ పరిధిలో 23.48 శాతం, ఎస్‌పీడీసీఎల్‌లో 70 శాతం మంది రైతులు ఎలాంటి ఖర్చు లేకుండా విద్యుత్ కనెక్షన్ పొందే అవకాశం ఉన్నట్లు డిస్కంలు తేల్చాయి. సీపీడీసీఎల్ పరిధిలో రైతులపై రూ.18 కోట్లు, ఈపీడీసీఎల్ పరిధిలో రూ.16.4 కోట్లు, ఎస్‌పీడీసీఎల్ పరిధిలో రూ.14.23 కోట్ల భారం పడుతుందని అంచనా.
పంచాయతీరాజ్‌శాఖ 2020 అక్టోబరు 9న జారీ చేసిన జీవో నంబరు-677
చిన్న, సన్నకారు రైతులకు బోర్లు తవ్వించి ఇవ్వడంతోపాటు సబ్‌మెర్సిబుల్ మోటార్లు, అవసరమైన విడిభాగాలు, విద్యుత్ కనెక్షన్లను ఉచితంగా ఇస్తాం. వైఎస్‌ఆర్ జలకళ పథకంలో భాగంగా నాలుగేళ్లలో 1.5 లక్షల వ్యవసాయ బోర్లు తవ్వాలనేది లక్ష్యం.
పంచాయతీరాజ్‌శాఖ 2020 డిసెంబరు 14న జారీ చేసిన ఉత్తర్వు నంబరు-689
ఎక్కువ మంది రైతులకు జలకళ పథకం కింద అర్హత కల్పించేలా వాల్టా చట్టాన్ని అనుసరించి.. రైతు పొలంలో ప్రస్తుతం ఎలాంటి బోరు, బావి ఉండకూడదు. ఒకవేళ ఉంటే.. అవి పాడై నిరుపయోగంగా ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించాలి. రైతుకు కనీసం 2.5 ఎకరాల భూమి ఉండాలి. 5 ఎకరాలకు మించకూడదు.
ఇవీ చదవండి: