తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సంపన్నవర్గాలు నివాసం ఉండే ప్రాంతాల నుంచి మురికివాడల వరకూ రహదారికి ఇరువైపులా వేలాది దుకాణాలుంటాయి. చిరు ఉద్యోగులు, కూలీలు, పేదవర్గాల కొనుగోళ్ల ఆధారంగానే చిన్న వ్యాపారాలు సాగుతుంటాయి. అధికార లెక్కల ప్రకారం సుమారు 25,000 మంది వీధి వ్యాపారులు ఉంటారని అంచనా.
కాలనీలు, బస్తీల్లో దాదాపు లక్షన్నర చిరు దుకాణాలుంటాయి. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ ఆంక్షలతో చాలావరకూ మూసివేశారు. మహా నగరంలోని లక్షలాది మంది వలస కార్మికులు ఉపాధి లేక సొంతూళ్లకు చేరుతున్నారు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దుకాణాల్లో కొనుగోళ్లు భారీగా తగ్గాయి.
నగరంలోని బి.హెచ్.ఇ.ఎల్ సమీపంలోని ఓ కిరాణా దుకాణంలో రోజూ రూ.20,000 విలువైన అమ్మకాలు జరిగేవి. ప్రస్తుతం రోజువారీ రూ.5000 వస్తువులు విక్రయించటమే కష్టంగా మారిందని దుకాణదారుడు ఆవేదన వెలిబుచ్చాడు. వేసవి సీజన్ కోసం తెచ్చిన రూ.10 లక్షల సరకు అప్పు తీర్చేందుకు పదేళ్లు కష్టపడి కూడబెట్టిన స్థలాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తమ బంధువుల్లో ఒక చిరు వ్యాపారి ఆత్మహత్యకు ప్రయత్నించాడని వాపోయాడు.
అప్పులు ఎలా తీర్చాలని ఆవేదన...
చిరు వ్యాపారుల కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చేవి పండుగలు. ఆ సమయంలో జరిగే వ్యాపార లావాదేవీలు కీలకం. ఉగాది, రంజాన్ పండుగల వేళ ఈ ఏడాది వ్యాపారాలు మందగించాయి. రోజువారీ ఆదాయంపై ఆధారపడి జీవించే కుటుంబాలకు పని లేక కొనుగోళ్లు తగ్గాయి. ఫలితంగా అప్పుచేసి తెచ్చిన సరకులు అమ్ముడుపోక దుకాణదారులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
వేసవికాలం.. రంజాన్ పండుగ వేళల్లో సొమ్ము చేసుకుందామని ఆశపడిన వారి అంచనాలు తలకిందులయ్యాయని చర్లపల్లి ప్రాంతానికి చెందిన కుండల వ్యాపారి పోచమ్మ తెలిపారు. కరోనాకు భయపడి ఎవ్వరూ చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయట్లేదని తెలిపారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఆదాయం బాగుండేదని, ప్రస్తుతం రోజుకు నాలుగైదు కుండలు అమ్మటమే కష్టంగా మారిందని ఆవేదన వెలిబుచ్చారు. తాను తెచ్చిన రూ.2లక్షల అప్పు, వడ్డీ ఎలా తీర్చాలనేది అర్థం కావట్లేదని వాపోయారు. ఇలా నగరంలో చాలామంది చిరు వ్యాపారుల జీవితాలను కరోనా చీకటిమయం చేసింది.
జూబ్లీహిల్స్ పరిధిలో అన్నదమ్ముల కుటుంబాలకు కిరాణా దుకాణమే ఆధారం. తల్లిదండ్రుల పోషణ, పిల్లల చదువు, భవిష్యత్ అవసరాలన్నీ తీరేది వ్యాపారంతోనే. వీరి దుకాణం కంటెయిన్‌మెంట్ జోన్‌కు సమీపంలో ఉండడం వల్ల తెరిచేందుకు సోదరులు వెనుకంజ వేస్తున్నారు. కరోనా వ్యాప్తికి తాము కారణం కాకూడదనే ముందుచూపుతో ఇలా చేశామంటూ చెప్పారు. పెళ్లిళ్ల సీజన్ కోసం తెచ్చిన లక్షలాది రూపాయల సరకు కొంతమేర పనికిరాకుండా ఉందనే ఆవేదన వెలిబుచ్చారు. అప్పు చేసి సరకులు తెచ్చామని వాపోయారు.
నల్లగండ్ల ప్రాంతంలో పదుల సంఖ్యలో దుకాణాలు.. వేలాదిమంది భవన నిర్మాణ కార్మికుల కొనుగోళ్లతో కళకళలాడుతుండేవి. లాక్‌డౌన్‌తో పనులు నిలిపివేయటంతో బేరాలు ఆగిపోయాయి. వలసజీవులు సొంతూళ్లకు ప్రయాణం చేస్తున్న పరిస్థితుల్లో చిరు వ్యాపారుల పరిస్థితి తలకిందులైంది.
ఇదీ చదవండి: