Hyderabad Marathon 2022: ఏటా జరిగే మారథాన్లలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. యువత, మధ్యవయస్కులు పాల్గొనడం సాధారణమే అయినా.. అరవై ఏళ్లు దాటిన వారు సైతం 42 కి.మీ.పైగా సాగే మారథాన్లను పూర్తి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ వయసులో పరుగెత్తవచ్చా? మనవల్ల అవుతుందా? ఇలాంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఎంతోమంది ఆరు పదుల వయసులోనూ నిత్యం పరుగెత్తుతున్నారు. ఫిట్‌నెస్, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఆదివారం జరిగే ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్-22కు సన్నద్ధం అవుతున్నవారిని పలకరించినప్పుడు.. వారు చెప్పిన ఎన్నో విషయాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.
59 ఏళ్ల వయసులో మొదలుపెట్టా - డాక్టర్ బి.ఆర్.హరిహరన్(74):
మొదటిసారి 2007లో హాఫ్ మారథాన్‌లో పాల్గొన్నా. అప్పుడు నా వయసు 59 ఏళ్లు. పదిహేను ఏళ్లుగా ఆపకుండా ప్రపంచంలోని ఏడు ఖండాల్లో జరిగిన మారథాన్లలో పాల్గొన్నాను. నాకు విహారం అంటే ఇష్టం. ఇప్పటివరకు 40 నగరాల్లో జరిగిన 221 పోటీల్లో పాల్గొన్నాను. ఇందులో 11 అల్ట్రా మారథాన్ పోటీలు ఉన్నాయి. 48 మారథాన్లు, 162 హాఫ్ మారథాన్లు ఉన్నాయి. చాలా పతకాలు అందుకున్నాను. ఈసారి కూడా పాల్గొంటున్నాను. దీని తర్వాత సెప్టెంబరులో బెర్లిన్‌లో, అక్టోబరులో లండన్‌లో జరిగే మారథాన్లకు హాజరవుతున్నా.
క్యాన్సర్‌తో పోరాడుతూనే.. - రాఘవరావు(77), జూబ్లీహిల్స్
నేను జిమ్‌లో కసరత్తులు చేస్తుంటా. ఇది చూసిన నా మిత్రుడు ఒకరు మారథాన్లలో పరుగెత్తమని సూచించాడు. 42.2 కి.మీ. చాలా ఎక్కువ దూరం అని సంశయిస్తుంటే మొదట 10 కి.మీ. పరుగులో పాల్గొనమని చెప్పాడు. అలా మొదటిసారి 2018లో 10కె పరుగులో పేరు నమోదు చేసుకున్నా. ఆ తర్వాత చాలా పోటీల్లో పాల్గొన్నా. ఇటీవల ఫిబ్రవరిలో నాకు క్యాన్సర్ బయటపడింది. కుంగిపోకుండా ఉండేందుకు చురుగ్గా ఉండేలా రోజూ 4-5 కి.మీ. జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో పరుగెత్తుతున్నా.
వంద రోజుల సవాల్- జోగిబాయి74), గచ్చిబౌలి
చిన్నతనంలో రోజూ పాఠశాలకు వెళ్లేందుకు 2.5 కి.మీ. నడిచేదాన్ని. మళ్లీ ఇప్పుడు రెండేళ్ల నుంచి నడక మొదలు పెట్టడంతో చిన్నతనం గుర్తుకొస్తోంది. నా కూతురు నన్ను క్రమం తప్పకుండా నడవమని ప్రోత్సహించింది. తను 1200 రోజుల నడకలో పాలు పంచుకుంటోంది. అమె నాకు ప్రేరణ. కొవిడ్‌లోనూ నడక ఆపలేదు. ఇంట్లోనే 8 వేల అడుగులు వేసేదాన్ని. ఇటీవల వందరోజుల పరుగు సవాల్‌ను స్వీకరించి పూర్తిచేశాను. నేను ఈ వయసు లోనూ చురుగ్గా ఉండటానికి పరుగు, నడక దోహదం చేస్తుంది.
నడక నుంచి మారాను.. - ఉమ చిత్ర(59)
పరుగు అంటే అథ్లెట్ల కోసమని అనుకునేదాన్నే. నడక మాత్రం క్రమం తప్పక చేసేదాన్ని. వయసు పెరిగేకొద్దీ బరువు పెరిగాను. బరువు తగ్గడానికి పరుగెత్తాలని నా సోదరుడు చెప్పాడు. సంజీవయ్య పార్క్ రన్నర్స్ గ్రూపులో 2018లో చేరాను. కొద్దిరోజుల్లో నాలో మార్పు గమనించాను. బరువు తగ్గడమే కాదు రోగ నిరోధకశక్తి పెరిగింది. ఆ తర్వాత చాలా 5కె, 10కె పరుగు పోటీల్లో పాల్గొన్నాను.
ఇవీ చదవండి: