దిశ నిందితుల ఎన్కౌంటర్(DISHA ENCOUNTER CASE) జరిగిన స్థలంలో ఆధారాలు సేకరించిన క్లూస్ టీం అధికారి వెంకన్నపై సిర్పూర్కర్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఘటనా స్థలంలో గడ్డి ఎక్కువగా ఉండటం వల్ల తూటాలు లభించలేదని వెంకన్న కమిషన్‌కు వివరించారు. ఎన్కౌంటర్ సమయంలో తుపాకీ వినియోగించారని నిర్ధారించేందుకు తుపాకీ పేలిన అవశేషాలను ఎలా తీశారని కమిషన్ తరఫు న్యాయవాది పరమేశ్వర్ ప్రశ్నించారు.
దూది, డిస్ట్రిలరీ వాటర్ వినియోగించి తుపాకీ పేలిన అవశేషాలు తీశామని వెంకన్న బదులివ్వగా.. ఎన్హెచ్ఆర్సీ నిబంధనలు ఎందుకు పాటించలేదని కమిషన్ నిలదీసింది. ఎన్కౌంటర్ జరిగిన తీరుపై గీసిన రఫ్ స్కెచ్ ను మంగళవారం సమర్పించాలని వెంకన్నను ఆదేశించింది.
అంతకుముందు ప్రత్యక్షసాక్షి అయిన తెలంగాణలోని ఫరూఖ్ నగర్ సహాయ రెవెన్యూ అధికారి రవూఫ్‌ను ప్రశ్నించారు. ఎస్సైతో తన కళ్లల్లో ఇసుక కొట్టి ఆయన చేతిలోని తుపాకీని ఆరిఫ్ లాక్కుని పోయినట్లు ఆయన కమిషన్‌కు తెలిపారు. కళ్లల్లో మట్టి కొట్టిన తర్వాత ఆరిఫ్ పోలీసులపై కాల్పులు జరిగన ఘటనను నువ్వు ఎలా చూడగలిగావని కమిషన్ ప్రశ్నించింది. అక్కడి అధికారుల హెచ్చరికలు, తూటాల శబ్దం విని కాల్పులు జరిగినట్లు భావించానని వివరణ ఇచ్చారు.
సజ్జనార్ విచారణ వాయిదా
సిర్పూర్కర్ కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు సజ్జనార్ హైకోర్టు ప్రాంగణంలోని కార్యాలయానికి చేరుకున్నారు. మిగతా సాక్ష్యుల విచారణ ఉండటంతో ఈనెల 7వ తేదీ విచారణకు హాజరుకావాలని కమిషన్ సజ్జనార్‌కు సూచించింది.
ఇదీ చూడండి: Disha Encounter: సిర్పుర్కర్ కమిషన్ విచారణ.. హాజరైన సజ్జనార్