రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం చేసి 2018 జులై 1 తర్వాత పదవీ విరమణ చేసిన కొత్త పింఛనర్లు తాజా పెన్షన్ స్లిప్పులు చూసి హతాశులయ్యారు. 2022 జనవరి నెలకు వారికి ఇచ్చే పింఛను మొత్తం ఎంతో సీఎఫ్‌ఎంఎస్ సాయంతో ఖజానా అధికారులు ఖరారు చేశారు. ఆ మొత్తం 2021 డిసెంబరు నెల పింఛనుతో పోలిస్తే విశ్రాంత ఉద్యోగి స్థాయిని బట్టి సుమారు రూ.5వేల నుంచి రూ.15వేల వరకు తగ్గిపోయింది. 2022 సవరించిన పీఆర్‌సీ నిబంధనల ప్రకారం కొత్త పింఛను లెక్కకట్టి కొత్త పెన్షన్ స్కేల్ నిర్ధారించి ఇవ్వలేదు. అలాగని 2021 డిసెంబరులో ఇచ్చినంత మొత్తమూ రాలేదు. విశ్రాంత ఉద్యోగుల పింఛను లెక్కలు ఆయా ప్రభుత్వ శాఖలే సిద్ధం చేసి, ఏజీ కార్యాలయానికి పంపి ఖరారు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగులు కొత్త పీఆర్సీకి సహకరించేందుకు సిద్ధంగా లేనందున ఈ ప్రక్రియ మరికొంత ఆలస్యమవుతుంది. దీంతో కొన్ని నెలలపాటు ఇలా కోత పడ్డ పింఛన్లే అందే పరిస్థితి ఉందని సమాచారం. ఆనక 2022 పీఆర్‌సీ ప్రకారం మూల పింఛను లెక్కించి, ప్రస్తుతం ఎంత కోతపడిందో అన్ని నెలలదీ కలిపి ఎరియర్స్‌గా చెల్లిస్తారు. పీఆర్సీ చరిత్రలో తొలిసారి ఐఆర్ కన్నా ఫిట్‌మెంట్ తగ్గిపోవడం, ఆ ఐఆర్‌ను సర్దుబాటు చేయాలని నిర్ణయించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. అసలు పింఛను ఎంతో తేలిన తర్వాత ఎరియర్స్ చెల్లించేస్తామని చెబుతున్నారు.
ఇదీ చదవండి: Retirement: పదవీ విరమణ ప్రయోజనాలు దక్కక ఇక్కట్లు...రూ.800 కోట్ల వరకు పెండింగ్
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!