రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ (ENGENEERING COUNSELLING IN AP)లో తీవ్ర జాప్యం జరుగుతోంది. తెలంగాణలో ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్ ముగిసి, తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఏపీలో మాత్రం ఇంత వరుకూ ప్రవేశాల షెడ్యూలే ఖరారు చేయకపోవడం గమనార్హం. కళాశాలలకు అనుబంధ గుర్తింపు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు బోధన రుసుములు ఖరారు చేయడంలో అధికారుల ఆలస్యం కారణంగా విద్యార్థులు ఎదురు చూడాల్సి వస్తోంది.
ఈఏపీసెట్ పరీక్షను ఆగస్టు 25న పూర్తి నిర్వహించగా.. సెప్టెంబరు 8న ఫలితాలు విడుదలయ్యాయి. కానీ.. ఇంత వరకూ కౌన్సెలింగ్ ప్రకటన వెలువడలేదు. కళాశాలలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియను ఆగస్టు 31లోపు పూర్తి చేయాలని ఏఐసీటీఈ ఆదేశించినా.. ఆ ప్రక్రియను విశ్వవిద్యాలయాలు సకాలంలో పూర్తి చేయలేదు. పరిస్థితి ఇలా ఉంటే.. అక్టోబరు 1 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ ఇటీవల ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేయడం గమనార్హం.
ఫీజుల ఖరారు ఎప్పుడో?
ఈ ఏడాది ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35 శాతం కన్వీనర్ కోటాను ప్రవేశపెట్టారు. ఇంజినీరింగ్ కోర్సులను నిర్వహిస్తున్న ఆరు వర్సిటీలకు కన్వీనర్ కోటా బోధన రుసుములను నిర్ణయించాల్సి ఉండగా.. ఆ ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. ఫీజుల నిర్ణయానికి ఇటీవల ప్రకటన విడుదల చేశారు. కళాశాలలు ఆదాయ వ్యయాల లెక్కలు సమర్పించి, వాటిని ఆడిటింగ్ చేసి ఫీజులు నిర్ణయించాలంటే.. కనీసం మరో 10 రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రవేశాల మొదటి విడత కౌన్సెలింగ్‌కు కనీసం 10-12 రోజుల సమయం అవసరం. ఈ ఆలస్యం ప్రభావం అనివార్యంగా తరగతుల ప్రారంభంపై పడనుంది.
తరలిపోతున్న విద్యార్థులు..
రాష్ట్రంలో కౌన్సెలింగ్(ENGENEERING COUNSELLING IN ANDHRA PRADESH) ఆలస్యమవుతుండటంతో.. విద్యార్థులు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లోని ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీలకు తరలిపోతున్నారు. ఇప్పటికే.. కొందరు ఆయా వర్సిటీల్లో చేరిపోయారు. మరికొందరు ప్రాధాన్యమున్న డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఫీజుల ఖరారుపై ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తూనే ఉంది. తాజాగా.. కౌన్సెలింగ్‌పై ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసింది. ఇదిలా ఉంటే.. కొన్నేళ్లుగా ప్రవేశాల కౌన్సెలింగ్ ఆన్‌లైన్ బాధ్యతను జాతీయ సమాచార కేంద్రం (ఎన్‌ఐసీ) నిర్వహించేది. ఈ ఏడాది దాన్ని ఏపీఆన్‌లైన్, టీసీఎస్‌కు అప్పగించారు. దీనిపై.. కన్వీనర్‌కు, ఉన్నత విద్యామండలికి మధ్య స్పష్టత కొరవడడంతో.. ఈ ఇబ్బందులు ఎదురవుతున్నట్టు సమాచారం.
ఇదీ చూడండి: APRDC: ఏపీఆర్‌డీసీకి ఆస్తుల బదలాయింపు!