ప్రజాక్తాకోలి పుట్టి పెరిగింది థానేలో. గలగల మాట్లాడే ఈ చిన్నది రేడియో జాకీ కావాలని కలలు కనేది. అనుకున్నట్టుగానే మాస్‌మీడియాలో డిగ్రీ పూర్తవ్వగానే ముంబైలో ఫీవర్ 104ఎఫ్.ఎమ్. ఆర్జేగా కెరీర్ మొదలుపెట్టింది. ఏడాదికే ఆ ఉద్యోగం రొటీన్‌గా అనిపించిందట. ఏదైనా కొత్తగా చేద్దాం అనుకుంటున్నప్పుడే హృతిక్‌రోషన్‌తో కలిసి సరదాగా చేసిన వీడియోని తన సోషల్‌మీడియా ఖాతాలో పెట్టింది. ఆ వీడియోలో ప్రజాక్తా చలాకీతనాన్ని గమనించిన స్నేహితుడు, యూట్యూబర్ అయిన సుదీప్ లాహిరి... యూట్యూబ్ ఛానల్ పెట్టమని సలహా ఇచ్చాడట. అలా 2015లో ‘మోస్ట్‌లీసేన్’ను ప్రారంభించింది. అమ్మానాన్నలు ఏమంటారోనని భయపడిన ప్రజాక్తాకి ‘మరేం ఫర్వాలేదు... ఒత్తిడి లేకుండా ఏం చేస్తావో అది చేయి’ అని ప్రోత్సహించారు. అప్పట్నుంచీ వెనుదిరిగి చూడలేదామె.
ఆమే... మాంటూ!
‘5 టైప్స్ ఆఫ్ సింగిల్స్’ పేరుతో ప్రేమికుల రోజున చేసిన ఓ వీడియో సూపర్‌డూపర్ క్లిక్ అవ్వడంతో యువతలో ప్రజాక్తాకి సూపర్ ఫాలోయింగ్ వచ్చేసింది. ముఖ్యంగా ‘మాంటూ’గా అబ్బాయి వేషంలో ఆమె చేసే హాస్య వీడియోలకు కడుపుబ్బా నవ్వాల్సిందే. అలా తన ప్రత్యేకమైన అభినయంతో 57.5 లక్షలమంది యూట్యూబ్ సబ్‌స్క్రైబర్స్‌తోపాటు పాతికలక్షలమంది ఇన్‌స్టా ఫాలోవర్స్‌నీ సంపాదించుకుంది. సినీ తారలకు ధీటుగా 55 ఫ్యాన్‌క్లబ్స్ ఉన్నాయీమెకు.
సామాజిక స్పృహ...
‘లక్షలాది మంది యువత నేను పెట్టే వీడియోలని ఫాలో అవుతున్నారు. అలాంటప్పుడు నాక్కూడా వారిపట్ల అంతే బాధ్యత ఉండాలికదా’... అనే ప్రజాక్తా సామాజిక సమస్యలని ఏమాత్రం విస్మరించదు. ముఖ్యంగా యువత పెడదోవపట్టకుండా... అనేక సమస్యలపై వీడియోలు చేస్తూ ఉంటుంది. దేశభక్తి, సైబర్‌బుల్లీయింగ్, హోమోఫోబియా, హేట్‌స్పీచ్, బాడీషేమింగ్, ఫేక్‌న్యూస్ వంటివాటిపై వీడియోలు చేసి యువతను ఆలోచింప చేసింది. పుల్వామా దాడి జరిగినప్పుడు... బ్రిగేడియర్ ఇంద్రజీత్ సింగ్ గాఖాల్‌తో చేసిన ఇంటర్వ్యూ ఇందుకు తొలిమెట్టు. ‘వీటిని వ్యూస్‌తో ముడిపెట్టను... సామాజిక బాధ్యత తర్వాతే ఏదైనా’ అంటుంది ప్రజాక్తా.
ఐరాసలో వీడియో...
యూట్యూబ్ ప్రారంభించిన ‘క్రియేటర్స్ ఫర్ ఛేంజ్’ కార్యక్రమానికి భారత్ తరపున వరుసగా రెండుసార్లు ఎంపికైన ఏకైక డిజిటల్ క్రియేటర్ ప్రజాక్తా. ఈమె చేసిన ‘నో అఫెన్స్’ వీడియోని న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ టాలరెన్స్’ సందర్భంగా ప్రదర్శించారు. అన్నిదేశాల మధ్య మన త్రివర్ణ పతాకానికి ప్రతినిధిగా నిల్చోవడం చాలా సంతోషంగా అనిపించిందంటుంది ప్రజాక్తా. ‘క్రియేటర్స్ ఫర్ ఛేంజ్’ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం మిషెల్ ఒబామాతో కలిసి ఆడపిల్లల చదువు కోసం ముందడుగు వేస్తోంది. మనదేశంతోపాటూ వియత్నాం, నమీబియా మొదలైన దేశాలు తిరిగి మహిళా సమస్యలని ప్రజలకి చేరువ చేసే ప్రయత్నం చేస్తోంది.
గెలుపు మంత్రం...
యువతలో పెరుగుతున్న మానసిక సమస్యలపై దృష్టి పెట్టిన ప్రజాక్తా పరిష్కారంగా వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి తన వీడియోల ద్వారా ఫండ్‌రైజింగ్ చేసే పనిలో పడింది. బోనీకపూర్ కూతురు అన్షులా ప్రారంభించిన ‘ఫ్యాన్‌కైండ్’ సంస్థతో కలిసి మానసిక సమస్యలపై పోరాడుతోంది. కరీనాకపూర్, ఆయుష్మాన్‌ఖురానా, నవాజుద్దీన్ సిద్దీఖీ, ఆలియాభట్... మొదలైనవారి ఇంటర్వ్యూలు చేసింది. ‘ప్రజలు ఏం కోరుకుంటున్నారు... మనమేం అందిస్తున్నాం. ఈ రెండింటి మధ్య ఉన్న సమన్వయం గురించి తెలిస్తే సక్సెస్‌ఫుల్ యూట్యూబర్‌గా రాణించడం ఏమంత కష్టం కాద’ంటున్న ప్రజాక్తా వినూత్నమైన షార్ట్‌ఫిల్మ్స్‌లోనూ నటిస్తోంది.
ప్రభావిత మహిళ...
‘నేనెప్పుడూ అమ్మానాన్నల్ని పాకెట్‌మనీ అడగలేదు. 15 ఏళ్లనుంచే థియేటర్ ఆర్టిస్టుగా కొంత సంపాదించుకునేదాన్ని. నిజానికి మొదట్లో డబ్బు విలువ తెలిసేదికాదు. కానీ పన్ను చెల్లించడానికి మొదటిసారి చెక్ ఇచ్చినప్పుడు మాత్రం... అరెరె నా డబ్బంతా ఇలా పన్నుల రూపంలో పోతుందే... అని బాధపడ్డా. అప్పట్నుంచీ డబ్బుని ఎలా సద్వినియోగం చేయాలనే విషయం మీద దృష్టిపెట్టా’ అని చెబుతుంది 27 ఏళ్ల ప్రజాక్తా. గతేడాది ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈ ఏడాది బిజినెస్ వరల్డ్ ప్రకటించిన అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో అనుష్కశర్మ, జియా మోదీ వంటి వారి సరసన నిలిచింది. ఎగ్జిబిట్ మ్యాగజైన్ ఈమెను ప్రపంచంలోని వందమంది డిజిటల్ ప్రభావిత వ్యక్తుల్లో ఒకరిగా మెచ్చుకుంది.
మూడురోజులే పని...
ఈ యూట్యూబర్... వారంలో మూడు రోజులు మాత్రమే వీడియోలమీద పని చేస్తుంది. మిగతా టైమ్ కుకింగ్, రీడింగ్, కరావోకె... మొదలైన హాబీలకి కేటాయిస్తుంది. పుస్తకాలంటే ప్రాణం పెడుతుంది. ఉదయాన్నే టీ తాగుతూ పుస్తకం చదవడం తనకెంతో ఇష్టం. ఎంత బిజీగా ఉన్నా సరే, నెలకో పుస్తకమైనా పూర్తిచేయాల్సిందే. ‘సేపియన్స్’, ‘డైరీ ఆఫ్ యంగ్‌గార్ల్’ ఆమె ఫేవరెట్ పుస్తకాల జాబితాలో ఉన్నాయి.
ఇదీ చదవండి: