Venkatram Reddy On PRC:పీఆర్‌సీపై ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చిందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారని వెల్లడించారు. ఉద్యోగులకు 55 శాతం మేర ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరామన్న వెంకట్రామిరెడ్డి.. ఫిట్‌మెంట్ 40 శాతం కంటే తగ్గదని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. పీఆర్‌సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చించాలని కోరారు. అన్ని సంఘాలతో సీఎం చర్చించాకే ఫిట్‌మెంట్ ప్రకటించాలన్నారు.
'ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని సజ్జల చెప్పారు. ఉద్యోగులకు 55 శాతం మేర ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరాం. ఫిట్‌మెంట్ 40 శాతం కంటే తగ్గదని భావిస్తున్నాం. పీఆర్‌సీపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చించాలి. అన్ని సంఘాలతో సీఎం చర్చించాకే ఫిట్‌మెంట్ ప్రకటించాలి' - వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
AP Empolyees Union Rally: మరోవైపు ఉద్యోగులు వారి ఆందోళనలను ఉద్ధృతం చేస్తున్నారు. ఇవాళ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్ సెంటర్ వరకు పశ్చిమ కృష్ణ జిల్లా జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు బొప్పరాజు, బండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బొప్పరాజు.. పీఆర్సీతో పాటు అన్ని డిమాండ్లపైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. 13 లక్షల మంది ఉద్యోగుల అభిమానాన్ని తాకట్టు పెట్టవద్దని వెంకట్రామిరెడ్డికి హితవు పలికారు. ప్రభుత్వం కూడా వెంకట్రామి రెడ్డి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సచివాలయ ఉద్యోగులు వెంకటరామిరెడ్డి తీరుతో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.
సజ్జల నుంచి ఫోన్..
ఇవాళ సాయంత్రం 5 గంటలకు అధికారులతో సమావేశం ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేశారని బండి శ్రీనివాసరావు చెప్పారు. కానీ ఆ విషయంలో అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. సమావేశం ఉంటే 71 డిమాండ్లతో కూడిన పీఆర్సీపై చర్చించాలని కోరారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపైనే తాము ప్రభుత్వం ముందు ఉంచుతున్నామని పలువురు ఉద్యోగులు స్పష్టం చేశారు. పీఆర్సీ సహా పెండింగ్ బకాయిలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గుంటూరు జిల్లాలో కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. పీఆర్సీ అమలు కోసం అనంతపురంలో టవర్ క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట, పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ఎన్జీవోలు ఆందోళనకు దిగారు. పీఆర్సీ తక్షణమే అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని తిరుపతిలో ఉద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల్లూరులోనూ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
AP Empolyees Union Rally: 'పీఆర్‌సీ సహా.. వాటిపైనా ప్రభుత్వం స్పందించాలి'