Godavari Flood: గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతున్నందున... ధవళేశ్వరం వద్ద మధ్యాహ్నం మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముంపు మండలాల అధికారులను అప్రమత్తం చేసింది. వరద ఉద్ధృతి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. కూనవరం, వి.ఆర్.పురంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసింది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని,.. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గోదావరి ఎగువ ప్రాంతం తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఇంద్రావతి, ప్రాణహిత, కిన్నెరసాని, తాలిపేరు, శబరి వంటి ఉప నదులు పొంగిపొర్లుతుండటంతో నదిలో ప్రమాదకర స్థాయిని మించి ప్రవాహం కొనసాగుతోంది.
గొట్టా బ్యారేజ్: ఒడిశాలో భారీ వర్షాలతో వంశధార నదికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని గొట్టా బ్యారేజ్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గొట్టా బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 43,308 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 44,562 క్యూసెక్కులుగా ఉంది. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ 08942-240557 ఏర్పాటు చేశారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
మళ్లీ జల దిగ్బంధంలోకి గ్రామాలు: వరద ప్రభావంతో విలీన మండలాల్లోని గ్రామాలు మళ్లీ జల దిగ్బంధనంలోకి చేరుకున్నాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని రహదారులు నీట మునగడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉద్ధృతి నుంచి ఇప్పుడిప్పుడే గ్రామాలు కోలుకుంటుండగా, మళ్లీ మరోసారి వరద పోటెత్తటం, బాధితులకు ఆందోళన కలిగిస్తోంది. రుద్రంకోట వరద బాధితులు 25 రోజులుగా గుట్టపై తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఈ సమయంలో తిరిగి వరద పెరుగుతుందన్న సమాచారం వారికి నిద్ర లేకుండా చేస్తోంది.
విలీన మండలాల వాసులను భయపెడుతున్న వరదలు: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలవాసులను గోదావరి, శబరి వరదలు మళ్లీ వణికిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదులు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. వారం రోజుల క్రితమే ఇళ్లకు చేరుకున్న బాధితులు మరోసారి సామగ్రి సర్దుకుని పునరావాస కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుందనే సమాచారంతో కొందరు ఇక్కడి నుంచి తెలంగాణలోని పట్టణ ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అధికారుల నుంచి ఎటువంటి స్పష్టమైన సమాచారం లేదని ముంపువాసులు వాపోతున్నారు. కూనవరంలో మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు గోదావరి వరద నీటి మట్టం 42 అడుగులు దాటింది. వరరామచంద్రాపురంలోని కన్నాయిగూడెం వద్ద, చింతూరు-వరరామచంద్రాపురం ప్రధాన రహదారిపై వరద నీరు చేరింది. ఎటపాక మండలం గుండాల, కొల్లుగూడెం, రాయనపేట, తదితర మురుమూరు గ్రామాల సమీపంలోకి వరదనీరు చేరింది. ఎటపాక మండలం నెల్లిపాక, వీరాయిగూడెం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి.
* దేవీపట్నం వద్ద గోదావరి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు అడుగుల మేర నీటిమట్టం పెరగడంతో పోశమ్మగండి వద్ద గండిపోశమ్మ అమ్మవారి ఆలయం పూర్తిగా నీట మునిగింది. రాకపోకలు నిలిచిపోయాయి. కొండమొదలు పంచాయతీలో కత్తనాపల్లి, కొత్తగూడెం, తాళ్లూరు గ్రామాల గిరిజనులు కొండలపై బిక్కుబిక్కుమంటున్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా: వరదల కారణంగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేసినట్లు చింతూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రఘురామ్ మంగళవారం తెలిపారు. చింతూరు, వరరామచంద్రపురం జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న పరీక్షలను బోర్డు రెండు వారాలపాటు వాయిదా వేసినట్లు చెప్పారు. రసాయనశాస్త్రం, వాణిజ్యశాస్త్రం పరీక్షలు జరగాల్సి ఉందన్నారు.
ఇవీ చదవండి: