గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియకు అవరోధం కలిగించాలని చూస్తే.... కఠిన చర్యలు తప్పవని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్మార్ హెచ్చరించారు. అలాంటివారి కదలికల్ని నిశితంగా గమనించాలని..... సమస్యలు సృష్టించేవారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసుశాఖను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి.... సీఈసీతో సమానంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారాలుంటాయని.... గతంలో సుప్రీం తీర్పుని ఉటంకిస్తూ 5పేజీల ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో.... ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ను కొనసాగిస్తామన్నారు. ఎన్నికల ప్రక్రియలో సుప్రీం జోక్యం చేసుకోని నేపథ్యంలో... యథావిధిగా ఎన్నికలు నిర్వహించాలన్నదే తమ తుది నిర్ణయమన్నారు. ఓపక్క ఎన్నికలు, మరోపక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా సాగేలా ప్రభుత్వం, ఈసీ సమన్వయంతో పనిచేస్తాయన్నారు. ఎన్నికల్లో కరోనా రక్షణ చర్యల్ని అత్యున్నత ప్రమాణాలతో చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల నిర్వహణలో.... సీఈసీ, ఎస్ఈసీకి ఒకేలాంటి అధికారాలుంటాయని.... కిషన్సింగ్ తోమర్ వర్సెస్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును నిమ్మగడ్డ గుర్తు చేశారు. ఇకపై.... ఎన్నికల సంబంధిత అంశాల్లో ప్రభుత్వ విభాగాలు, అధికారులు, కలెక్టర్లు.... ఎస్ఈసీ ఆధ్వర్యంలోనే పనిచేయాలని..... తమకున్న విశేషాధికారాల దృష్ట్యా తాము చెప్పేదే తుది నిర్ణయమన్నారు. గవర్నర్‌ను కలిసి.... ఎస్ఈసీ తీసుకున్న చర్యలను తెలియచేశామని..... రాజ్యాంగబద్ధ విధుల నిర్వహణకు పూర్తి సహకారం అందిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారన్నారు. ఎన్నికలకు అవసరమైన రవాణా, ఆర్థిక వనరులు సమకూర్చడం వంటి బాధ్యతలన్నీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్ పర్యవేక్షించాలని సూచించారు.
ఎన్నికల నిర్వహణకు హైకోర్టు సమ్మతి తెలియచేసినప్పటి నుంచే కోడ్ అమల్లోకి వచ్చిందని నిమ్మగడ్డ పేర్కొన్నారు. దాని అమలు బాధ్యత.... కలెక్టర్లు, ఎస్పీలదేనన్నారు. శాంతిభద్రతల నిర్వహణకు ఓ ఐపీఎస్.... ఎన్నికల సంఘానికి సహకరిస్తారన్నారు. స్వేచ్ఛాయుత, సక్రమ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ కట్టుబడి ఉందన్నారు. నామినేషన్ల వ్యవహారంలో ఏ సమస్య తలెత్తినా, ఫిర్యాదులొచ్చినా తక్షణమే స్పందించి.... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో వెంటనే పరిష్కరిస్తామని వివరించారు.
ఎన్నికలను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్న నిమ్మగడ్డ..... కొన్ని వ్యతిరేక స్వరాలు వినిపించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా... పౌరుల్ని నిరోధించేందుకు ఎవరికీ నైతికంగానూ, న్యాయపరంగానూ హక్కు లేదన్నారు. ప్రక్రియను అడ్డుకునేందుకైనా, అభ్యర్థులే లక్ష్యంగా ఎలాంటి చర్యలకు దిగినా సహించబోమన్నారు. అభ్యర్థులకు కమిషన్ పూర్తి భద్రత కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. సమస్యలు సృష్టించేవారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించిన ఎస్ఈసీ..... ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: అధికారులపై చర్యలు కోరుతూ సీఎస్, డీజీపీకి ఎస్ఈసీ లేఖ