Schools Reopen In Telangana: వేసవి సెలవుల అనంతరం తెలంగాణలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వేసవి సెలవులు పొడిగింపు లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 లక్షల మంది పిల్లలకు ఆహ్వానం పలికారు. స్థానిక ప్రజాప్రతినిధులు.. సోమవారం వారివారి దగ్గర్లో ఉన్న స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు స్వాగతం పలకాలని కోరారు. పాఠశాలల ప్రారంభ కోసం అన్ని ఏర్పాట్లూ చేసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. 'మన ఊరు-మన బడి' కార్యక్రమంలో భాగంగా 9వేల పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పనులు జరుగుతాయని స్పష్టం చేశారు. పిల్లలకు యథావిధిగా బుక్స్, యూనిఫాం అందిస్తామన్నారు.
ఆంగ్ల మాధ్యమంలో బోధన..: ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని మంత్రి తెలిపారు. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని వెల్లడించారు. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లూ చేశామని వివరించారు. ప్రత్యేక చొరవ తీసుకొని పిల్లలకు ఇంగ్లీష్ మీడియం బోధన అందించాలని టీచర్లకు సూచించారు.
ఇవీ చదవండి..