రాష్ట్రంలో 6, 7, 8 తరగతులకు బడులు పునఃప్రారంభంపై ప్రభుత్వం మార్పులు చేసింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి 6, 7, 8 తరగతుల విద్యార్థులకు తరగతులు నిర్వహించాల్సి ఉండగా.. 6, 7, తరగతుల ప్రారంభాన్ని డిసెంబరు 14కు వాయిదా వేసింది. డిసెంబరు 14 నుంచి 1-5 తరగతులను ప్రారంభించాల్సి ఉండగా.. అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. సంక్రాంతి సెలవుల తర్వాతే 1 నుంచి 5వ తరగతి వరకు పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23న ఎనిమిదో తరగతి విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నారు. ఈనెల 2 నుంచి 9, 10 విద్యార్థులకు తరగుతులు పాఠశాలలను పునఃప్రారంభించారు. ఒక్కో తరగతి గదిలో 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా ప్రణాళికలు రూపొందించడంతో పాటు తల్లిదండ్రుల అంగీకారంతోనే విద్యార్థులను పాఠశాలకు అనుమతించారు.
కరోనా దృష్ట్యా
విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపులుగా ఉండకుండా జాగత్త్రలు తీసుకోవడంతో పాటు ప్రతి విద్యార్థి వ్యక్తిగతంగా మాస్కు, నీళ్ల సీసా ఉపయోగించుకునేలా ప్రోత్సహించినా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరోనా సోకింది. దీనిపై తల్లిదండ్రులతో పాటు వివిధ సంఘాలు, రాజకీయ పక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లవెత్తాయి. రోజు విడిచి రోజు ఒంటిపూట తరగతులు నిర్వహించడంతో పాటు ఏప్రిల్ 20 వరకు విద్యాసంవత్సరం నిర్వహించాలని యోచించినా ఆచరణలో మాత్రం అది సులభతరంగా కనిపించలేదు. కరోనా భయంతో ఎక్కువమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు ఆసక్తి కనబర్చకపోవడం, పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయుల్లో పలువురికి కరోనా సోకిన కారణాల దృష్ట్యా విద్యాశాఖ పునరాలోచనలో పడింది.
పాఠశాలల వేళల్లో మార్పులు
గత షెడ్యూల్ ప్రకారం 8, 9 తరగతుల వారికి రోజు మార్చి రోజు ఒంటిపూట బడులు నిర్వహించగా 23వ తేదీ నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు తరగతులు నిర్వహించనున్నారు. 8, 9 తరగతుల విద్యార్థులకు మాత్రం రోజు మార్చి రోజు పాఠశాలలు కొనసాగనున్నాయి. డిసెంబరు 14 నుంచి 6, 7 తరగతులను పునః ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నా అప్పటి పరిస్థితుల అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారు. 1 నుంచి 5 తరగతులకు సంబంధించి డిసెంబరు 14 నాటి పరిస్థితులకు అనుగూణంగానే నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఈ సమయాల్లోనూ స్వల్ప మార్పులు తీసుకొచ్చారు. రాష్ట్రంలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న చలికారణంగా ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పాఠశాలల వేళల్లో మార్పులు తీసుకొచ్చారు.
ఇదీ చదవండి : అమ్మ ప్రేమ మరిచి... కన్నబిడ్డను అమ్ముకుంది..!