విద్యార్థులకు ఏటా రూ.20 వేలు వసతి, ఆహార ఖర్చులు..
రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలల్లో ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ప్రభుత్వం బోధన రుసుములు చెల్లించదు. 2020-21 నుంచి ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటాలో పీజీ కోర్సుల్లో చేరే వారికి జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన పథకాలు వర్తించబోవని స్పష్టం చేస్తూ సాంఘిక సంక్షేమ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ పీజీ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో చేరిన వారికి మాత్రమే ఈ రెండు పథకాలు వర్తిస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్ సీఈవో జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో తగిన మార్పులుచేయాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా బోధనరుసుములు, జగనన్న వసతి దీవెన ద్వారా విద్యార్థులకు ఏటా రూ.20 వేలు వసతి, ఆహార ఖర్చుల కోసం చెల్లిస్తోంది.
'విద్యార్థులే బోధన రుసుములు చెల్లించాలి'
ఏటా లక్ష మంది..రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కళాశాలల్లో ఏటా లక్ష మంది మంది వరకు పీజీ కోర్సుల్లో చేరుతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి కొత్త ప్రవేశాల ప్రక్రియ జరగాల్సి ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో ఇక నుంచి విద్యార్థులే బోధన రుసుములు చెల్లించాలి. వీటితో పాటు గతేడాది పీజీ కళాశాలల్లో ఏయే కోర్సుకు ఎంత బోధన రుసుము చెల్లించాలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2018-19 వరకు ఏఎఫ్‌ఆర్‌సీ(ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిషన్) నిర్ణయించిన ప్రకారం... ఎంటెక్‌కు రూ.57 వేలు, ఎంఫార్మసీ రూ.1.10 లక్షలు, ఫార్మాడీ(పోస్టు బ్యాచిలర్) రూ.68 వేలు, ఎంబీఏ, ఎంసీఏలకు రూ.27 వేలు బోధనరుసుము ఉండేది.
తేలని గతేడాది లెక్క..
గత విద్యాసంవత్సరానికి(2019-20) సంబంధించి పీజీ కోర్సులకు బోధనరుసుముల విడుదలపై ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. 2018-19కి సంబంధించి 6 నెలలు, గతేడాది బకాయిలు కలిపి మొత్తం రూ.550 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.