రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్ల కేసుల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో తప్పేముందని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అన్ని కోణాల్లో విచారించే.. ఈ కేసును హైకోర్టు కొట్టేసినట్లు కనిపిస్తోందని.. మీ వాదనకు సరైన ప్రాతిపదిక ఏమీ కనిపించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లకు సంబంధించి చెక్క గురుమురళీమోహన్ తదితరులపై వెలగపూడికి చెందిన సరివేంద్ర సురేష్ చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసులు నమోదుచేసింది. వాటిపై గురుమురళీమోహన్, ఇతరులు హైకోర్టును ఆశ్రయించగా.. అది ఇన్‌సైడర్ ట్రేడింగ్ కాదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలుచేసింది. పిటిషన్‌పై జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.
సివిల్, క్రిమినల్ కేసు ఎలా కలుపుతారు?
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ‘రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై సిట్ దర్యాప్తును హైకోర్టు నిలిపివేసింది. ఇదే అంశంపై మరో కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి’ అని కోరారు. ఈ సమయంలో పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్, న్యాయవాది సుఘోష్ సుబ్రహ్మణ్యం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది క్రిమినల్ కేసు, అది సివిల్ కేసు అని... రెండింటినీ ఎలా కలుపుతారని ప్రశ్నించారు.
రెండింటినీ కలపబోమని, దీనిపై విడిగా విచారణ చేపడతామని ధర్మాసనం చెప్పగా అందుకు దవే అంగీకరించి, వాదనలు కొనసాగించారు. ‘రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకొని భూములు కొన్నారు. ఇందులో గత ప్రభుత్వ హయాంలో ఉన్నతస్థానంలో ఉన్నవారు, ఉన్నతాధికారులు ఉన్నారు. సిట్ దర్యాప్తు కొనసాగనివ్వాలి. ఏమీ జరగలేదని తేలితే ఏ ఇబ్బందీ లేదు. ఈ దశలో ఎవరినీ దోషులుగా తేల్చడం లేదు. పౌరులపై కేసులు నమోదు చేయడం లేదు. దర్యాప్తు కొనసాగాలని మేం భావిస్తున్నాం’ అని తెలిపారు.
ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం... ‘హైకోర్టు తీర్పును సవాలు చేసే ప్రాతిపదిక ఏమీ కనపడటం లేదు. మీరు చెప్పే కారణాలేంటి? మీ పిటిషన్‌ను పరిశీలిస్తే హైకోర్టు ఇలా చేయకూడదనే కారణాలే మీరు చెబుతున్నారు’ అని వ్యాఖ్యానించింది. దవే స్పందిస్తూ.. భూ సేకరణ అక్రమాలను తీవ్రంగా పరిగణించి విచారణ చేయించాల్సిన అవసరం ఉందంటూ హరియాణాకు చెందిన ఓ కేసులో జస్టిస్ లలిత్ ధర్మాసనం అనుమతించిందని, సుప్రీంకోర్టు పలుమార్లు ఇలాంటి తీర్పులు ఇచ్చిందన్నారు.
విచారణలో జోక్యం సరికాదు..
కేసు తొలిదశలోనే హైకోర్టు జోక్యం చేసుకొని తుది నిర్ణయానికి వచ్చిందని, విచారణ అంశాల్లో హైకోర్టు జోక్యం సరికాదన్నారు. దర్యాప్తు సంస్థలు ఆధారాలను ట్రయల్ కోర్టు, హైకోర్టు ముందు పెట్టినప్పుడు తుది నిర్ణయానికి రావచ్చని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని కీలకమైన వ్యక్తులు అధికారిక రహస్యాలు తెలుసుకొని తమకు అనుకూలమైన వారికి ముందే తెలియజేసి లబ్ధి కలిగేలా చేశారని ధర్మాసనానికి విన్నవించారు.
జోక్యం చేసుకున్న ధర్మాసనం పబ్లిక్ డొమైన్‌లోనూ, పత్రికల్లోనూ ముందే రాజధాని ప్రాంతంపై వార్తలు వచ్చాయని హైకోర్టు తీర్పులో ఉందని.. అలాంటప్పుడు ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఏమిటని ప్రశ్నించారు. విజయవాడ సమీపంలో అన్నారని, అమరావతి ప్రాంతం పేరు తెలపలేదని దవే బదులిచ్చారు. మీరు చెప్పే తీర్పుల వివరాలు కావాలని ధర్మాసనం చెప్పగా తనకు కొంత సమయం కావాలని దవే కోరారు. మధ్యాహ్న భోజన అనంతరం అందజేస్తామని, వాదనలు వినిపించేందుకు తనకు గంట సమయం కావాలని విజ్ఞప్తిచేశారు. మధ్యాహ్నం తమకు వేరే కేసులు ఉన్నందున సోమవారం విచారణ చేపడతామంటూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి:
jagan disproportionate assets case: 'జప్తు చేసిన భూములను హెటిరో సంస్థకు అప్పగించండి'