Sanitation workers strike: కార్మిక సంఘాల నాయకులతో పురపాలకశాఖ ఉన్నతాధికారులు గురువారం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేయాలని పురపాలక కార్మిక, ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ చర్చలు జరిగాయి. సంఘాల నాయకులు లేవనెత్తిన డిమాండ్లపై ఉన్నతాధికారుల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ముందుగా ప్రకటించిన ప్రకారం సమ్మెకు వెళ్లాలని నిర్ణయించామని నేతలు వెల్లడించారు.
వడ్డేశ్వరంలోని పురపాలకశాఖ రాష్ట్ర కార్యాలయంలో కమిషనర్ ప్రవీణ్‌కుమార్ కార్మిక సంఘాల నాయకులు కె.ఉమామహేశ్వరరావు, పి.సుబ్బారాయుడు, జి.సుబ్బారావు, ఎ.రంగనాయకులు, మధుబాబు, శంకరరావు, రమణ, వెంకటరెడ్డి, సోమయ్య, నారాయణ, జ్యోతిబసుతో గురువారం చర్చలు జరిపారు. ఆరోగ్య భత్యంతో కలిపి కార్మికులకు రూ.21 వేల జీతం చెల్లించాలని.. లేదంటే 11వ పీఆర్‌సీ సిఫార్సుల మేరకు రూ.20 వేల జీతం, కరవు భత్యం అమలు చేయాలని కార్మిక సంఘాల నేతలు కోరారు. కరవు భత్యం రూ.3 వేలుతో కలిపి జీతం రూ.18 వేలు చెల్లిస్తామని కమిషనర్ తెలిపారు. దీనికి నేతలు అంగీకరించలేదు.
ఇవీ చూడండి: