అది 2020 డిసెంబరు 30. చెన్నైలో టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్ అనే సంస్థ ఊపిరి పోసుకుంది. వారం తిరక్కముందే 2021 జనవరి 5న ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలు, విక్రయాల్ని ఏదైనా కేంద్ర సంస్థకు గానీ, అవి ముందుకు రాకపోతే వేలం ద్వారా ఏదైనా ప్రైవేటు సంస్థకు గానీ అప్పగించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్లకే గనుల శాఖ టెండర్లు పిలిచింది. ఎక్కడో హిమాచల్ ప్రదేశ్‌లోని శిమ్లాలోను, మధ్యప్రదేశ్‌లోని నిగ్రీలోను రిజిస్టర్డ్ చిరునామాలు, దిల్లీలో కార్పొరేట్ కార్యాలయం ఉన్న జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ అనే సంస్థ ఏపీలో ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టు దక్కించుకుంది.
తర్వాతే.. అసలు కథ మొదలైంది. టెండర్ దక్కించుకున్న జేపీ సంస్థ ప్రతినిధులు గానీ, ఉద్యోగులు గానీ ఏపీలో ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో పెద్దగా నిమగ్నమవలేదు. జేపీ పవర్ వెంచర్స్‌కి సబ్ కాంట్రాక్టర్‌గా టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్ సంస్థ రంగంలోకి దిగింది. తమిళనాడు నుంచి వందల మంది కార్మికుల్ని, ఉద్యోగుల్ని ఇసుక రేవుల్లో, స్టాక్ పాయింట్లలో మోహరించింది. ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక వ్యాపారమంతా ఆ సంస్థ గుప్పిట్లోనే ఉంది. అది ఆడిందే ఆట. పాడిందే పాట. అది ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) అటువైపు కన్నెత్తి చూడదు. ఇప్పుడు అర్థమైంది కదా...! టర్న్‌కీ సంస్థ ఏర్పాటుకు, ఆ తర్వాత వారం రోజులకే ఇసుకను ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించడానికి మధ్య సంబంధమేంటో..!
గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉచితంగా దొరికిన ఇసుకను.. వైకాపా ప్రభుత్వం పక్కా వ్యాపార వస్తువుగా మార్చేసింది. ఇసుక బంగారంగా మారిపోయింది. వైకాపా అధికారంలోకి వచ్చాక... అప్పటివరకూ అమల్లో ఉన్న ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసింది. 2019 సెప్టెంబరులో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఏపీఎండీసీ ద్వారా ఇసుక విక్రయాలు జరిపింది. ఆ తర్వాత మరో కొత్త విధానం తెచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ కమిటీ 2021 జనవరిలో నివేదిక ఇవ్వడం, ఆ వెంటనే కేబినెట్ నిర్ణయం తీసుకోవడం, దానికి వారం రోజుల ముందుగా చెన్నైలో టర్న్‌కీ సంస్థ ఏర్పాటవడం... అంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
పేరుకే జేపీ సంస్థ..! : రాష్ట్రంలో గత ఏడాది ఆరంభంలో మూడు జోన్లుగా పిలిచిన ఇసుక టెండర్లను ఉత్తరాదికి చెందిన జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం గత ఏడాది మే 14 నుంచి ఇసుక తవ్వకాలు, విక్రయాలు మొదలయ్యాయి. తమిళనాడుకు చెందిన ఉద్యోగులు పెద్దసంఖ్యలో రంగంలోకి దిగారు. వారంతా ఎవరని ఆరా తీయగా... టర్న్ కీ ఎంటర్‌ప్రైజ్ పేరు తెరపైకి వచ్చింది. జేపీ సంస్థ ప్రమేయం కొంతేనని, కర్త.. కర్మ.. క్రియ.. అన్నీ టర్న్‌కీ సంస్థేనని అర్థమైపోయింది. కంపెనీస్ ఆఫ్ రిజిస్ట్రార్ వివరాల ప్రకారం.. టర్న్‌కీ సంస్థ చిరునామా చెన్నైలోని పురసయివాక్కంలో ఉంది. దండపాణి పళనిస్వామి, బోసాని శ్రీనివాసరెడ్డి, బోసాని రవికాంత్‌రెడ్డి అందులో డైరెక్టర్లు. వారిలో పళనిస్వామి 2020 డిసెంబరు 30 నుంచి డైరెక్టర్‌గా ఉండగా, శ్రీనివాసరెడ్డి, రవికాంత్‌రెడ్డి మాత్రం గత ఏడాది డిసెంబరు 7 నుంచి డైరెక్టర్లుగా చేరారు. ప్రభుత్వం గత ఏడాది ఇసుక టెండర్లకు సన్నాహాలు చేస్తున్నప్పుడే... వాటిని చెన్నైకి చెందిన ఒక మైనింగ్ వ్యాపారికి కట్టబెట్టేందుకే ఇదంతా చేస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. చివరకు జేపీ సంస్థ టెండర్లు సొంతం చేసుకున్నా, చెన్నైకి చెందిన టర్న్‌కీ సంస్థే మొత్తం ఇసుక తవ్వకాలు, విక్రయాలు నిర్వహిస్తుండటం విశేషం.
అంతా వారి కనుసన్నల్లోనే.. : గతంలో ఇసుక తవ్వకం, విక్రయాల్ని ఏపీఎండీసీ నిర్వహించినప్పుడు అన్ని జిల్లాల్లో కలిపి సుమారు 2వేల మంది స్థానికులకు ఉపాధి దొరికేది. ఇప్పుడు టర్న్‌కీ సంస్థ స్థానికులకు అవకాశం ఇవ్వడం లేదు. రాష్ట్రంలోని అన్ని రీచ్‌లు, నిల్వకేంద్రాల్లో ఇసుక లోడింగ్ లెక్కలు రాయడం, డబ్బులు వసూలు చేయడం వంటి పనులన్నీ తమిళనాడుకు చెందినవారే చేస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగాల్లోనూ 75% స్థానికులకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినా... ఇసుక తవ్వకాలు, విక్రయాల పనుల్లో అది అమలవడం లేదు. టర్న్‌కీ సంస్థ తమిళనాడుకు చెందినవారిని, ఏపీ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు చెందిన తెలుగు మాట్లాడేవారిని తీసుకొచ్చి పనిలో పెట్టుకుంది. ఏపీఎండీసీ హయాం నుంచి పనిచేస్తున్నవారిలో చాలా కొద్దిమందిని అక్కడక్కడా కొనసాగిస్తోంది.
రూ.కోట్లలో లావాదేవీలు : గనుల శాఖ లెక్కల ప్రకారం రోజుకు సగటున 54 వేల టన్నుల చొప్పున, ఏటా సుమారు రెండు కోట్ల టన్నుల ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. టన్ను రూ.475 చొప్పున ఏడాదికి రూ.950 కోట్ల ఆదాయం వస్తోంది. రూ.475 రీచ్‌లో ధర మాత్రమే. స్టాక్ పాయింట్లు ఉన్నచోట రవాణా ఛార్జీలు కలిపి వసూలు చేస్తున్నారు. ఇలా వచ్చే నగదులో టన్నుకు రూ.375 చొప్పున గుత్తేదారు సంస్థ ప్రతి 15 రోజులకు ప్రభుత్వ ఖజానాకు బ్యాంకు ఖాతాల ద్వారా జమ చేస్తోందని అధికారులు చెబుతున్నారు.
పారదర్శకతకు పాతర: ఇసుక రేవులు, నిల్వ కేంద్రాల్లో డిజిటల్ చెల్లింపుల్ని అంగీకరించడం లేదు. నగదు చెల్లిస్తేనే ఇసుక లోడ్ చేస్తున్నారు. యాప్, గ్రామ సచివాలయాల ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉన్నా, దానిపై అవగాహన లేక ఎక్కువ మంది రీచ్‌కే వెళుతున్నారు. అక్కడ కచ్చితంగా నగదు చెల్లించాల్సి వస్తోంది. ఒక పక్క గ్రామాల్లో చిన్న చిన్న కిరాణా కొట్లలోనూ ఆన్‌లైన్ చెల్లింపులు జరుగుతుండగా... రోజూ రూ.కోట్లలో లావాదేవీలు జరిగే ఇసుకకు ఆన్‌లైన్ చెల్లింపుల్ని అనుమతించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గతంలో ఇసుక రీచ్‌ల్ని డ్వాక్రా మహిళలు నిర్వహించినప్పుడు, ఏపీఎండీసీ ఆధ్వర్యంలో విక్రయాలు జరిగినప్పుడు పూర్తిగా ఆన్‌లైన్ చెల్లింపులు జరిగేవి. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల మన్‌కీబాత్‌లో... దేశంలో రోజూ రూ.20 వేల కోట్ల ఆన్‌లైన్ చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రధాని ఆన్‌లైన్ చెల్లింపుల్ని ప్రోత్సహిస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం ఆశ్చర్యపరుస్తోంది. ఇసుక కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లోనూ చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పిస్తామని గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, సంచాలకుడు వెంకట్‌రెడ్డి గత డిసెంబరులోనే చెప్పినా... ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు. టర్న్‌కీ సంస్థకు ‘వెసులుబాటు’ కోసమే ప్రభుత్వం ఆన్‌లైన్ చెల్లింపుల్ని అమల్లోకి తేవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఆన్‌లైన్ చెల్లింపులుంటే... టర్న్‌కీ సంస్థ రోజుకు ఎక్కడెంత ఇసుక విక్రయించింది? ఎంత ఆదాయం వచ్చిందన్న వివరాలు రికార్డెడ్‌గా ఉంటాయి. పైగా ఇసుక రీచ్‌లు, స్టాక్‌పాయింట్లలో ఇసుక కొన్నవారికి... టర్న్‌కీ ఎంటర్‌ప్రైజ్ పేరుతో ముద్రించిన, చేత్తో రాసిన వే బిల్లులు ఇస్తున్నారు. వాటిని ఆ సంస్థ సొంతంగా ముద్రించుకుంది. ఆన్‌లైన్ చెల్లింపులు లేకపోవడం, కంప్యూటర్‌లో జనరేట్ చేసిన బిల్లులు ఇవ్వకపోవడంతో... అన్ని బిల్లులకూ అధికారికంగా లెక్కలు చూపుతున్నారా? ప్రభుత్వ ఖజానాకి వెళ్లాల్సిన మొత్తం కచ్చితంగా వెళుతోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నో ఉల్లంఘనలు: రాష్ట్రంలో అత్యధిక రీచ్‌ల్లో వేబ్రిడ్జిలు లేవు. కేవలం అంచనా మేరకు ఇసుక లోడ్‌చేస్తున్నారు. అక్కడి సిబ్బందికి కొంత డబ్బు ఇస్తే, అనధికారికంగా ఎక్కువ ఇసుక లోడ్ చేస్తున్నారు. ఇసుక తవ్వకాలు, విక్రయాలు, రవాణాపై గనుల శాఖ, ఎస్‌ఈబీ అధికారులు తనిఖీలకు వెనకాడుతున్నారు. గతంలో ఏపీఎండీసీ ఆధ్వర్యంలో ఇసుక విక్రయాలు జరిగినప్పుడు ఎడాపెడా తనిఖీలు, ఉల్లంఘననలకు పాల్పడినవారికి జరిమానాలు వేయడం, కేసుల నమోదు ఉండేది. ఇపుడు ఎక్కడా ఆ దాఖలాల్లేవు.
ఇదీ చదవండి: దిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 27 మంది సజీవ దహనం