అనంతపురం జిల్లాలోని యల్లనూరు మండలంలో రెండు, శింగనమల మండలంలోని ఒక రేవులో ప్రైవేటు సంస్థ ఇసుక తవ్వకాలు ఆరంభించి, విక్రయిస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇసుక అవసరమైనవారంతా అక్కడికే వెళ్లాల్సి వస్తోంది. ఈ జిల్లాలోని రాయదుర్గం నుంచి శింగనమల దాదాపు 120 కి.మీ., హిందూపురం నుంచి 130 కి.మీ. దూరం. రాయదుర్గం, హిందూపురానికి సమీపంలో రేవులున్నా, ప్రైవేటు సంస్థ ఇంకా అక్కడ తవ్వకాలు ప్రారంభించలేదు. దీంతో రవాణా భారమవుతోంది. రేవులో టన్ను ఇసుక ధర రూ.475 చొప్పున 20 టన్నులకు రూ.9,500 కాగా, రాయదుర్గానికి రవాణాకు దాదాపు రూ.15 వేల వరకు ఖర్చవుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి..
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో మూడు జోన్లుగా 13 జిల్లాల్లోని ఇసుక తవ్వకాలు, విక్రయాల టెండరును జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ దక్కించుకుంది. ఈ నెల మొదటి రెండో వారంలో ఇసుక బాధ్యతలను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నుంచి జేపీ సంస్థకు అప్పగించారు. ఆన్‌లైన్‌లో బుకింగ్ అవసరం లేకుండా, నేరుగా రేవులోనే టన్ను రూ.475 చొప్పున చెల్లించి ఎవరైనా ఇసుక కొనుక్కునే అవకాశం కల్పించారు. అయితే గతంలో ఏపీఎండీసీ మాదిరిగా జేపీ పవర్స్ కూడా ఎక్కువ రేవుల్లో తవ్వకాలు ఆరంభిస్తే, అందరూ నేరుగా కొనుక్కునే వీలుండేది. రెండు వారాలవుతున్నా ఆ సంస్థ కొన్ని రేవుల్లో మాత్రమే తవ్వకాలు, విక్రయాలు చేపట్టింది. నిర్మాణ పనులు చేపట్టినవారు ఇసుక స్థానికంగా లభించక ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాలంటే ఇసుక ధర కంటే రవాణా ఖర్చులు ఎక్కువవుతున్నాయని వాపోతున్నారు.
ఒక్కొక్కటిగా తెరుస్తోంది..
రాష్ట్రంలోని 417 రేవుల్లో ఇసుక తవ్వకాలకు ప్రైవేటు సంస్థకు గనులశాఖ అనుమతించింది. ఇందులో దాదాపు 300 రేవులు అప్పగించారు. ఆ సంస్థ మాత్రం అన్నింటా తవ్వకాలు ఆరంభించలేదు. అవసరాల మేరకు ఇసుక తవ్వకాల రేవులు పెంచాలని, ఎక్కువ చోట్ల ఇసుక అందుబాటులో ఉంచాలని అధికారులు చెబుతున్నా, ప్రైవేటు సంస్థ ఒక్కొక్కటిగానే తెరుస్తోంది.
* గుంటూరు జిల్లాలో 53 రేవులకుగాను 8 చోట్ల, శ్రీకాకుళంలో 27 రేవులకు 3 చోట్ల తవ్వకాలు ఆరంభించారు. కడప జిల్లాలో కూడా రాజంపేట, నందలూరు పరిధిలోని మూడు రీచ్‌ల్లో మాత్రమే తవ్వకాలు జరుగుతున్నాయి.
* విశాఖ నగర పరిధిలోని ముడసర్లోవ, అగనంపూడి, భీమిలి, గ్రామీణ ప్రాంతంలోని నక్కపల్లి, అచ్యుతాపురం, అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నంలలో కలిపి మొత్తం 8 డిపోలకు రాజమహేంద్రవరం నుంచి తెచ్చిన ఇసుకను ఏపీఎండీసీ ద్వారా మొన్నటి వరకు విక్రయించేవారు. వీటిలో నిల్వ ఉంచిన 3 లక్షల టన్నుల ఇసుకతోపాటు ప్రైవేటు సంస్థకు అప్పగించారు. అయితే ఆ సంస్థ మాత్రం ముడసర్లోవ, అగనంపూడి, నక్కపల్లి డిపోల్లో మాత్రమే విక్రయాలు ఆరంభించింది. జిల్లావ్యాప్తంగా ఎవరికి ఇసుక కావాలన్నా ఈ మూడింటిలో ఏదో ఒకచోటికి వెళ్లాల్సి వస్తోంది.
* గతంలో విజయనగరం జిల్లాలోని మూడు డిపోలకు శ్రీకాకుళం నుంచి ఇసుక తెచ్చి విక్రయించేవారు. ప్రైవేటు సంస్థ బాధ్యతలు తీసుకున్నాక ఒక్క డిపోలోనూ విక్రయాలు మొదలుపెట్టలేదు. బాటలు ఏర్పాటు కాకపోవడం, గ్రామస్థుల అభ్యంతరాలు వంటి స్థానిక సమస్యలతో రేవులన్నీ తెరవడంలో జాప్యమవుతోందని గనులశాఖ అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ అధిగమించి అన్ని రీచ్‌లు తెరిచేందుకు మరికొంత సమయం పడుతుందని పేర్కొంటున్నారు. ఎక్కువ రేవుల్లో తవ్వకాలు ఆరంభించేలా ప్రైవేటు సంస్థపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు.
రేవుల సంఖ్య పెంచాలి
ఎక్కువ రేవులు తెరవకపోవడంతో.. నిర్మాణాలు చేపట్టినవారికి ఇసుక కొరత ఏర్పడుతోంది. కృష్ణా జిల్లాలో ఈ వారంలో 8 రేవుల్లో తవ్వకాలు మొదలవుతాయని చెప్పారు. ఇంకా ఆరంభం కాలేదు. వీలైనన్ని ఎక్కువ రేవులు అందుబాటులోకి వస్తే, నిర్మాణాలు వేగవంతమవుతాయి.
- ఆర్.వి.స్వామి, క్రెడాయ్ అధికార ప్రతినిధి
ఎడ్లబండ్లే దిక్కు
పూర్తిస్థాయిలో ఇసుక తవ్వకాలు ఆరంభించకపోవడంతో నిర్మాణాలకు అవసరమైనవారు స్థానికంగా వాగులు, వంకల నుంచి ఎడ్లబండ్ల ద్వారా రప్పించుకుంటున్నారు. వీటికి కొన్నిచోట్ల మాత్రమే పంచాయతీ అధికారులు అనుమతిస్తున్నారు. కొద్ది రోజుల కిందటి వరకు వాగులు, వంకల్లో ట్రాక్టర్ల ద్వారా కూడా ఇసుక తెచ్చుకునే వీలుండగా, ప్రైవేటు సంస్థకు అప్పగించాక.. ట్రాక్టర్లతో రవాణా నిలిపేశారు.
ఇవీ చూడండి...