రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా 1985 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్‌శర్మ నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో కొత్త ప్రధాన కార్యదర్శిగా సమీర్‌శర్మను నియమిస్తూ సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) రేవు ముత్యాలరాజు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న సమీర్‌శర్మ పోస్టును.. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రణాళిక, వనరుల సమీకరణగా మారుస్తూ శుక్రవారం మొదట జీవో విడుదల చేశారు. ఆ వెంటనే ఆయనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ మరో జీవో ఇచ్చారు. సమీర్‌శర్మ అక్టోబరు 1న కొత్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ కంటే సమీర్‌శర్మ సర్వీస్‌లో రెండేళ్ల సీనియర్. 1987 బ్యాచ్‌కు చెందిన ఆదిత్యనాథ్‌దాస్ పదవీకాలం జూన్ 30తో ముగియాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం మూడు నెలల పొడిగింపు ఇచ్చింది. ఆయన స్థానంలో సీఎస్‌గా నియమితులైన సమీర్‌శర్మ పదవీకాలం కూడా నవంబరు నెలాఖరున ముగుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కోరితే గరిష్ఠంగా ఆరు నెలలు పొడిగింపు లభించే అవకాశమున్నందున.. ఆయన ఎనిమిది నెలలపాటు సీఎస్‌గా కొనసాగవచ్చని భావిస్తున్నారు.
రాష్ట్రంలో, కేంద్రంలో కీలక బాధ్యతలు
సమీర్‌శర్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, కేంద్ర ప్రభుత్వంలోనూ పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. పలు అంతర్జాతీయ సంస్థల్లోనూ పనిచేశారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ సంస్థకు డైరెక్టర్ జనరల్, సీఈవోగా పనిచేస్తూ... కొన్ని నెలల క్రితం ఆ పోస్టును వదులుకుని రాష్ట్ర సర్వీసుకు తిరిగి వచ్చారు. ఆర్థిక, వాణిజ్య, కార్పొరేట్ గవర్నెన్స్‌లో విశేషానుభవం ఉన్న సమీర్‌శర్మకు.. పట్టణ వ్యవహారాల్లోనూ గట్టి పట్టుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నగరపాలక సంస్థలకు కమిషనర్‌గా పనిచేశారు. ఆప్కో, ఇండియన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్లకు సీఎండీగా.. స్మార్ట్ సిటీస్ మిషన్, అమృత్ కార్యక్రమానికి మిషన్ డైరెక్టర్‌గానూ వ్యవహరించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో రైతన్న సగటు రుణం 2,45,554