రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు జీతాలు, పింఛన్లు ఈ నెల కూడా కొంత ఆలస్యం కానున్నాయి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... మంగళవారం జీతాలు, పింఛన్లు జమ కావడం కష్టమే. ప్రస్తుతం చేతిలో ఓఅండ్‌ఎం కింద దాదాపు రూ.500 కోట్ల వరకు నిధులున్నాయని సమాచారం. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం సవరించడంతో ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద రూ.5వేల కోట్లు రానుంది. ఆ నిధులు రాబట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వు బ్యాంకుకు లేఖ రాసింది. మరోవైపు బహిరంగ మార్కెట్‌లో రూ.3వేల కోట్ల రుణాల సమీకరణకూ ప్రయత్నిస్తోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం.
రిజర్వుబ్యాంకులో మంగళవారం సెక్యూరిటీల వేలం ఉంది. దానిలో పాల్గొనేందుకు సర్కారు ప్రయత్నం చేస్తోంది. ఆత్మనిర్భర్ ప్యాకేజీ నిధులు వచ్చిన వెంటనే జీతాలు, పింఛన్ల చెల్లింపు ప్రారంభమవుతుంది. ఆ నిధులు మంగళవారం సాయంత్రానికి అందుతాయా? లేక బుధవారం అందుతాయా అన్నది చూడాలి. ప్రస్తుతం ఉన్న నిధులతో కొద్ది మందికి చెల్లింపులు జరిపి ఆనక మిగిలిన మొత్తాలు ఖాతాలకు జమ చేస్తారా లేక నిధులు అందిన తర్వాతే అందరికీ చెల్లింపులు ప్రారంభమవుతాయా అన్నది వేచి చూడాలి. జీతాలు, పింఛన్లకు కలిపి మొత్తం సుమారు రూ.4 వేల 300 కోట్ల వరకు అవసరమవుతాయి.
ఇదీ చదవండి: నేటి నుంచి విద్యార్థులకు వీడియో పాఠాలు