మూడు రాజధానుల అంశం వైకాపా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని... ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సవాలు విసిరారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కావాల్సిన వారికి మాత్రమే అమరావతి కామధేనువని ఆయన వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలో పెట్టటంతో పాటు మంత్రివర్గ ఉపసంఘం, నిపుణుల కమిటీ, అసెంబ్లీలో చర్చించాకే అభివృద్ధి వికేంద్రీకరణపై నిర్ణయం తీసుకున్నామని సజ్జల స్పష్టం చేశారు.
అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయం హడావిడిగా తీసుకున్నది కాదని సజ్జల పేర్కొన్నారు. దీన్ని అడ్డుకోడానికి తెదేపా సహా కొందరు 350 పిటిషన్లను కోర్టుల్లో వేశారని ఆయన తెలిపారు. వాటిని చట్టపరంగా ఎదుర్కొన్నాకే రాజధాని తరలుతుందని స్పష్టం చేశారు. ఈ అంశంపై తమ ప్రభుత్వం ఎన్నికలకు ఎందుకు వెళ్లాలని... ప్రజాభిప్రాయం తెలుసుకోవాలంటే చంద్రబాబు సహా తెదేపా శాసనసభ్యులే ఉపఎన్నికలకు వెళ్లాలని సవాలు విసిరారు. అమరావతిని అభివృద్ధి చేసేందుకు తగిన ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని వివరించారు.
ఇదీ చదవండీ... అమరావతి ప్రాంతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మూసివేత!