హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు కోలాహలంగా జరిగాయి. నారాయణగూడలో యాదవ సంఘం ఆధ్వర్యంలో... పెద్ద ఎత్తున సదర్ సయ్యాటలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దున్నరాజులు అందరినీ ఆకట్టుకున్నాయి. వాటిని అందంగా ముస్తాబు చేసి... విన్యాసాలు చేయించారు. ముషీరాబాద్‌లో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో దులియా జాతి దున్నరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
దీపావళి పర్వదినం మరుసటి రోజున సదర్ ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తోందని నిర్వాహకులు తెలిపారు. నగరం నలుమూలల నుంచి 30 దున్నలు వచ్చాయని చెప్పారు. కరోనా నేపథ్యంలో సదర్ ఉత్సవాలకు వచ్చే జనాలను భౌతిక దూరం పాటిస్తూ... మాస్క్ ధరించాలని కోరారు. నిజాం కాలం నుంచి యాదవ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవాలను జరుపుతున్నట్లు పేర్కొన్నారు. యాదవ కులవృత్తి అయిన పాల వ్యాపారాన్ని వృద్ధి చేయాలని కృష్ణుడిని పూజిస్తూ దున్నరాజుల విన్యాసాలు చేస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమానికి మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు హాజరయ్యారు. సదర్ వేడుకలు తిలకించేందుకు నగరవాసులు పెద్దఎత్తున తరలివచ్చారు.