రేపటి నుంచి బస్సు సర్వీసులు ప్రారంభిస్తామని ఆర్టీసీ ఎండీ ప్రతాప్ తెలిపారు. బస్సుల్లో సీట్ల అమరికను మారుస్తున్నామని..ప్రయాణికులు ఒకరినొకరు తగలకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కండక్టర్ లేకుండా బస్సులు నడపాలని ప్రతిపాదన వచ్చిందని...కండక్టర్ బస్సులో ఉంచితే ఏ ప్రయాణికుడికి వైరస్ ఉన్నా ఇబ్బందే అని చెప్పారు. ఆన్‌బోర్డ్ కండక్టర్ లేకుండా బస్సులు నడపడం ఎలా అన్న దానిపై ఆలోచనలు చేస్తున్నామన్నారు.
బస్సులో పక్కపక్కనే సీట్లు లేకుండా భౌతికదూరం పాటించేలా ఏర్పాటు చేస్తున్నాం. బస్సుల్లో సీట్లు తగ్గినా పర్వాలేదు... ప్రయాణికుల క్షేమమే ముఖ్యం. బస్సుల్లో భౌతికదూరం తప్పనిసరిగా పాటించేలా ఏర్పాటు చేశాం. బస్సు ఎక్కిన ప్రయాణికులు మాస్కులు ధరించడం తప్పనిసరి. బస్టాండ్‌లోని అన్ని స్టాళ్లలో మాస్కులు అందుబాటులో ఉంచుతాం.మాస్కు ధర రూ.10కి మించకుండా ఉండేలా చర్యలు తీసుకున్నాం - మాదిరెడ్డి ప్రతాప్, ఆర్టీసీ ఎండీ
బస్సు ఎక్కే ముందుగానే శానిటైజింగ్ చేసుకునేలా చర్యలు చేపడుతున్నామని ఆర్టీసీ ఎండీ పేర్కొన్నారు. ఆటోమేటిక్‌గా చేతులు శుభ్రపరిచే శానిటైజర్ యంత్రాలు బస్టాండ్లలో ఉంచుతామన్నారు. సిబ్బంది సహా ప్రయాణికుల భద్రత దృష్ట్యా నగదు రహిత విధానం అమలు చేస్తామని అన్నారు. ఆన్‌లైన్ రిజర్వేషన్ ద్వారా నగదు రహిత విధానంలో టిక్కెట్లు జారీ చేస్తామని వెల్లడించారు. అన్ని వ్యాలెట్లు, కార్డులు సహా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని వివరించారు.
436 రూట్లలో 17 శాతం బస్సులు
రేపట్నుంచి 436 రూట్లలో 17శాతం బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎండీ తెలిపారు. పరిస్థితిని బట్టి బస్సుల సంఖ్య క్రమంగా పెంచుతామని స్పష్టం చేశారు. అత్యవసరమైతేనే బస్సుల్లో ప్రయాణించాలని విజ్ణప్తి చేశారు. లాక్‌డౌన్ వల్ల ఆర్టీసీకి రూ.1200 కోట్లు నష్టం వచ్చినట్లు వెల్లడించారు. ఆర్టీసీకి రూ.700 కోట్ల ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 డ్రైవింగ్ స్కూళ్లు ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: