తెలంగాణ ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచేసింది. పెరిగిన ఛార్జీలు అర్ధరాత్రి నుంచి అమలు కానున్నాయి. కొన్నేళ్లుగా నిర్వహణ భారం పెరిగిందని... ఆదాయ వ్యయాలకు వ్యత్యాసం భారీగా ఉంటోంది.
2018-19 ఏడాదికిగాను ఆర్టీసీ ఆదాయం రూ. 4882.72 కోట్లు ఉండగా ఖర్చు రూ.5811.39 కోట్లుగా ఉంది. అందువల్లే తెలంగాణ ఆర్టీసీకి రూ.928.67 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొంది. ఆర్టీసీ మనుగడ సాధించాలంటే టికెట్ల ధరలు పెంచడమే భావ్యమని యాజమాన్యం ప్రభుత్వానికి నివేదించింది.
కిలోమీటర్‌కు - 20పైసలు పెంపు
" తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రతి కిలోమీటర్‌కు అన్ని సర్వీసులపై 20పైసలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతివ్వడం వల్ల వాటిని అర్థరాత్రి నుంచి అమలు చేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది"
గ్రేటర్ పరిధిలో పెరిగిన ధరలు
గ్రేటర్ పరిధిలో ఛార్జీలు భారీగా పెరిగాయి. ఒక్క ఏసీ బస్సులకు మాత్రం ఛార్జీలు పెంచలేదని గ్రేటర్ తెలంగాణ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇప్పటికే వీటికి ఎక్కువ ధరలు ఉన్నాయని ప్రయాణికుల నుంచి విజ్ఞప్తి రావడం ధరల పెంపు వాయిదా వేశారు.
తెలంగాణ - ఆర్టీసీ | ఛార్జీల పెంపు |
పల్లె వెలుగు, సెమీ ఎక్స్‌ప్రెస్ | రూ. 10 |
ఎక్స్‌ప్రెస్ | రూ. 15 |
డీలక్స్, లగ్జరీ | రూ. 20 |
సూపర్ లగ్జరీ | రూ. 25 |
రాజధాని, వజ్ర, గరుడ | రూ. 35 |
వెన్నెల స్లీపర్ | రూ. 70 |
కనీస ఛార్జీ రూ.10
గ్రేటర్ హైదరాబాద్‌లో కనీస ఛార్జీలు మాత్రం రూ.10 నిర్ణయించారు. ఆర్డినరీ ఆర్టీసీ బస్సుల ప్రస్తుత కనీస ధర రూ.5 ఉండగా దాన్ని రూ.10లకు పెంచారు. గ్రేటర్లో గరిష్ఠ ధర రూ.30 నుంచి రూ.35కు పెంచారు. మెట్రో ఎక్స్‌ప్రెస్ కనీస ధర రూ. 10లు ఉండగా... కనీస ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. మెట్రో డీలక్స్ కనీస ఛార్జీ రూ.10లు ఉండగా దాన్ని రూ.15లు చేశారు.
బస్ పాస్ ధరలు పెంపు
"బస్సు చార్జీలతో పాటు బస్సు పాస్ ల ధరలు కూడా పెరిగాయి. సాధారణ నెలవారీ బస్సులు పాస్‌లలో ఆర్డీనరి పాస్‌లు రూ.770ల నుంచి రూ.950లకు పెంచారు. మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్‌లను రూ.880 నుంచి రూ.1,070లకు పెంచారు. మెట్రో డీలక్స్ రూ.990 నుంచి రూ.1185లకు పెంచారు"
కిలోమీటర్‌కు ఛార్జీల్లో పెంపు పైసలలో
సర్వీసు | పాత ఛార్జీ | కొత్త ఛార్జీ |
పల్లెవెలుగు | 63 | 83 |
సెమీ ఎక్స్‌ప్రెస్ | 75 | 95 |
ఎక్స్‌ప్రెస్ | 87 | 107 |
డీలక్స్, లగ్జరీ | 98 | 118 |
సూపర్ లగ్జరీ | 116 | 136 |
రాజధాని, వజ్ర | 146 | 166 |
గరుడ ప్లస్ ఏసీ | 182 | 202 |
వెన్నెల ఏసీ స్లీపర్ | 253 | 272 |
- | - | - |
తెలంగాణ ఆర్టీసీ - పెంచిన ధరలు
- పల్లె వెలుగు బస్సుల్లో కనీసం ఛార్జీని రూ.10 నిర్ణయించారు. వీటిలో కనీస ఛార్జీలు ప్రస్తుతం రూ.6 ఉండగా వాటిని ఇవాళ అర్థరాత్రి నుంచి రూ.10కి పెంచారు.
- సెమి ఎక్స్ ప్రెస్ సర్వీసు ఛార్జీల కనీస ధరను రూ.10లకు పెంచారు. సెమి ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ప్రస్తుతం 75పైసల నుంచి 95పైసలకు పెంచారు. ఎక్స్ ప్రెస్ బస్సుల కనీస చార్జీలు రూ.15 పెంచారు. ప్రస్తుతం కిలోమీటరుకు 87 పైసలు నుంచి రూ.1.07 పైసలకు పెంచారు.
- డీలక్స్ బస్సుల ఛార్జీలు కనీసం రూ.20 పెంచారు. ప్రస్తుతం కిలోమీటరుకు 98 పైసల నుంచి రూ.1.18పైసలకు పెంచారు. డీలక్స్ బస్సుకు కనీసం ఛార్జీలు రూ.20కి పెంచారు.
- సూపర్ లగ్జరీ కనీస ఛార్జీలు రూ.25కు పెంచారు. ప్రస్తుత ఛార్జీలు రూ.1.16పైసల నుంచి రూ.1.36పైసలకు పెంచారు. రాజధాని/వజ్ర ఏసీ బస్సుల కనీస ఛార్జీలు రూ.35కు పెంచారు. ప్రస్తుత ఛార్జీలు కిలోమీటరుకు రూ.1.46పైసల నుంచి రూ.1.66పైసలకు పెంచారు. గరుడ ఏసీ బస్సులు కనీస ఛార్జీ రూ.35కు పెంచారు.
ఇదీ చూడండి: ఆర్టీసీలో అర్ధరాత్రి నుంచే వడ్డింపు.. ఛార్జీలు ఇవే!
ఏసీ బస్సుల ఛార్జీలు
- ప్రస్తుత ఛార్జీలు కిలోమీటరుకు రూ.1.71 పైసల నుంచి రూ.1.91లు పెంచారు. గరుడ ప్లస్ ఏసీ ఛార్జీలు కనీసం రూ.35లు పెంచారు.
- ప్రస్తుత ఛార్జీలను కిలోమీటరుకు రూ.1.82లు నుంచి రూ.2.02కు పెంచారు. వెన్నెల ఏసీ స్లీపర్ ఛార్జీలు కనీసం రూ.70లు పెంచారు.