వర్షాకాలం వచ్చిందంటే వాహనదారులు బెంబేలెత్తాల్సి వస్తోంది. అడుగడుగునా ఏర్పడిన గుంతల రహదారుల్లో ప్రయాణమంటేనే వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రాష్ట్ర, జిల్లా రహదారుల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని రహదారులైతే అడుగుకో గుంతతో కనిపిస్తుంటే, మరికొన్ని రాళ్లు తేలాయి. వర్షం కురిస్తే రోడ్లపై నీరు నిలిచి ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రెండు నెలల్లో కురిసిన వర్షాలకు ఇప్పటి వరకు రాష్ట్ర, జిల్లా రహదారుల్లో కలిపి దాదాపు 10 వేల కి.మీ. పరిధిలో గుంతలు ఏర్పడినట్లు అధికారులు లెక్కతేల్చారు. మరో 2 నెలలపాటు కురిసే వర్షాలకు ఇది రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
*రెండు, మూడేళ్లుగా వర్షాలకు దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేయడం లేదు. గత ఏడాది గుత్తేదారులను ఒప్పించి రూ.388 కోట్ల మేర దాదాపు 1500 పనులు చేయిస్తే.. ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదు.
*రూ.2,205 కోట్లతో అధ్వానంగా ఉన్న 9 వేల కి.మీ.లను పునరుద్ధరించేందుకు మార్చిలో ఆదేశాలిచ్చారు. రూ.2 వేల కోట్ల బ్యాంకు రుణం కోసం ప్రయత్నాలు కొలిక్కిరాలేదు. దీంతో 1,140 పునరుద్ధరణ పనులకు టెండర్లు పిలిస్తే, అయిదు జిల్లాల్లో 403 పనులకే బిడ్లు దాఖలయ్యాయి.
* న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు రుణంతో తొలిదశలో రూ.1,860 కోట్లతో 1,243 కి.మీ.లు విస్తరణ, 206 వంతెనల పనులకు టెండర్లు పిలిచి, మార్చిలో గుత్తేదారులతో ఒప్పందం చేసుకున్నా.. ఇప్పటి వరకు పనులు మొదలుకాలేదు.
* అన్ని బకాయిలు చెల్లించడమే కాకుండా, పునరుద్ధరణ పనులకు బ్యాంకు రుణం మంజూరయ్యే వరకు ఎటువంటి పనులు చేయబోమని గుత్తేదారులు పేర్కొంటున్నారు.
* అనంతపురం జిల్లా రాయలచెరువు నుంచి కర్నూలు జిల్లా డోన్‌కు వెళ్లే రహదారిలో చందన గ్రామ సమీపంలో దుస్థితి.
* ఎన్‌డీబీ కింద దీనిని విస్తరించేందుకు ప్రతిపాదన ఉండగా, ప్రస్తుతానికి మరమ్మతులు చేయలేదు. రెండు జిల్లాల మధ్య రాకపోకలు సాగించే వారికి గుంతల్లో ప్రయాణం తప్పడం లేదు.
* తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం-అమలాపురం రహదారిలో మందపల్లి వద్ద గుంతలమయమైన రోడ్డు ఇది. ఈ రహదారి పునరుద్ధరణకు టెండర్లు పిలిచినా గుత్తేదారులు ముందుకు రాలేదు. దీంతో వాహనదారులకు
అవస్థలు తప్పడం లేదు.
* తూర్పు గోదావరిలోని పి.గన్నవరం-రాజోలు రహదారిలో చాకలిపాలెం వద్ద రోడ్డు దుస్థితి. గుంతల్లో నుంచే వాహనదారులు రాకపోకలు సాగించాల్సి వస్తోంది.
ఇదీ చదవండి: ap capital: ఏపీ రాజధాని విశాఖ కాదు.. కేంద్రం వివరణ