రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలేనికి పశ్చిమ వైపున నిర్మించిన ఎన్-10 రహదారిని కొందరు దుండగులు రెండున్నర అడుగుల లోతున, 30 మీటర్ల పొడవున తవ్వేసి.. దాని లోపలున్న కంకరను తీసుకెళ్లిపోయారు. రోడ్డును తవ్వేసి కంకర తరలిస్తున్నారని తెలిసి అమరావతి దళిత ఐకాస నాయకులు గడ్డం మార్టిన్, ముళ్లమూడి రవి, చిలకా బవసయ్య, మేరిగ దాసు అక్కడికి వెళ్లేసరికి దుండగులు జేసీబీ, టిప్పరుతో పరారయ్యారు. దీంతో దళిత ఐకాస నాయకులు తవ్వకాలు జరిగినచోట నిల్చుని నిరసన తెలిపారు. రాజధాని రోడ్లను కాపాడాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అమరావతిని నాశనం చేయాలనే ఇలాంటి పనులు: దళిత ఐకాస
అనంతరం దళిత ఐకాస నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాజధాని అభివృద్ధి పనుల్లో భాగంగా 60 అడుగుల వెడల్పుతో, భూగర్భ డ్రైనేజీ సదుపాయంతో రహదారుల నిర్మాణం చేపట్టారన్నారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణం నిలిచిపోవటంతో దుండగులు తరచూ ఇలా అక్రమ తవ్వకాలకు పాల్పడుతూ కంకర, ఇసుక, ఇనుము దోచుకెళ్తున్నారని ఆరోపించారు. అమరావతిని నాశనం చేయాలనే జగన్ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని విమర్శించారు.
రోడ్డును తవ్వేసి.. అందులో ఉండే డస్ట్, గ్రావెల్‌ను అమ్ముకోవటానికి వైకాపా నాయకులే ఈ అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రాత్రి, పగలూ తేడా లేకుండా ఈ కంకరను లారీల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఈ రోజు కాకపోతే రేపైనా వారి గుట్టు బయటపడుతుందన్నారు. ‘జగన్ మోహన్‌రెడ్డికి అభివృద్ధి చేయటం చేతకాకపోతే ఊరుకోవాలి. అంతే తప్ప అమరావతి కోసం వేసిన రోడ్లను తవ్వేసి.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే ఊరుకోం. అక్రమార్కులకు ప్రభుత్వమూ, అధికారులు వెన్నుదన్నుగా ఉంటున్నారు. వారు ఇప్పటికైనా మేల్కొని చర్యలు తీసుకోకపోతే ప్రజలందరం తిరగబడి ఆస్తుల్ని కాపాడుకుంటాం’ అని అన్నారు.
ఇదీ చదవండి: