తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో రేవంత్ పూజలు చేస్తారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి 11 గంటలకు నాంపల్లిలోని యూసుఫైన్ దర్గాకు వెళ్లి అక్కడ చాదర్ సమర్పించి ప్రార్థనలు చేస్తారు. అక్కడ నుంచి ప్రదర్శనగా గాంధీభవన్‌కు చేరుకుంటారు. ఈ మధ్యాహ్నం 1.30 గంటలలోపు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారు. అదేవిధంగా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఇతర కమిటీ సభ్యులూ ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరిస్తారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన అంజన్‌కుమార్‌యాదవ్.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేసి అక్కడి నుంచి వచ్చి అసెంబ్లీలోని బంగారు మైసమ్మను దర్శించుకుంటారు. ఆ తర్వాత నాంపల్లి రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ నుంచి ఆయన తన అనుచరులు, అభిమానులతో కలిసి రేవంత్‌రెడ్డి ర్యాలీతో కలిసి గాంధీభవన్ చేరుకుంటారు.
ఎన్నటికీ గుర్తుండేలా..
ఇప్పటికే అధికార పక్షంపై దూకుడు పెంచి రాజకీయంగా చర్చకు తెరలేపిన నూతన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకునే కార్యక్రమాన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించేందుకు భారీ జనసమీకరణకు పిలుపునిచ్చారు. లక్ష మందికిపైగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు తరలివస్తారని అంచనా వేస్తున్న కాంగ్రెస్ నాయకులు.. నగరంలోని సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా.. కార్యకర్తలు తమ ప్రయాణం సాగించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారు.. మూడు నాలుగు వేల మందికి మించితే గాంధీభవన్‌లో సరిపోరు. బయట నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చే వారికి.. నియోజకవర్గాల వారీగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
గాంధీభవన్‌కు కొత్త కళ..
రేవంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు... నగరంలో పెద్ద ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలతోపాటు గాంధీభవన్, పరిసర ప్రాంతాలన్నీ స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో నిండిపోయాయి. అదే విధంగా చాలా చోట్ల హోర్డింగ్‌లు ఏర్పాటుచేశారు. మరొకవైపు గాంధీభవన్‌ను ఆధునికీకరించే పనులు వేగంగా సాగుతున్నాయి. గాంధీభవన్‌కు రంగులు వేయడం, ప్రాంగణం అంతా శుభ్రపరచడం, అనవసరమైన కట్టడాలను కూల్చేయడం తదితర కార్యక్రమాలతో కొత్త కళ తెచ్చి పెట్టారు.
గాంధీభవన్ కొత్త శోభ సంతరించుకునేట్లు లైటింగ్, సెంట్రల్ ఏసీ, ఫాల్ సీలింగ్, వుడ్ వర్క్, పెయింటింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. వేద, వాస్తు పండితుల సూచనలు, సలహాల మేరకు పీసీసీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుల ఛాంబర్లు మార్చేశారు. గాంధీభవన్‌లోకి రాకపోకలు సాగించే ద్వారాల విషయంలోనూ వాస్తు మార్పులు చేశారు.
రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి దక్షిణాది రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేతోపాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్యం ఠాగూర్ హాజరుకానున్నారు.
ఇదీచూడండి: ఆ క్షణం మృత్యువుదే!!