దగ్గు వచ్చినా, జలుబు లక్షణాలు కనిపించినా ఏదో తెలియని భయం. అమ్మో.. ఇది కరోనా ఏమో అనే గుబులు. ఆ ఆలోచన మరింత కుంగదీస్తోంది. కరోనా పరీక్ష ముగిశాక పాజిటివ్ వస్తే తల్లడిల్లిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాస్తంత ధైర్యమే...విజేతలుగా నిలుపుతుంది. సానుకూల దృక్పథమే సగం బలమిస్తుంది. వైద్యులంతా ఇదే విషయం చెబుతున్నారు. అయినా... చాలామందిలో అనుమానాలు తగ్గటం లేదు. ఎవరెంత అవగాహన కల్పిస్తున్నా...అపోహలు తొలిగి పోవటం లేదు. నిజానికి...పాజిటివ్‌గా నిర్ధరణ అయినా...పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్ఆర్) మార్గదర్శకాల ప్రకారం.. ఎటువంటి లక్షణాలు లేని పాజిటివ్‌లు, స్వల్ప లక్షణాలున్నవారు ఇంట్లోనే ఉండి చికిత్స పొందవచ్చు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో వేల మంది ఇంట్లో ఉండి కోలుకున్నారు... కోలుకుంటున్నారు.
ధైర్యంగా ఉంటే సగం జయించినట్లే!
వైరస్ ఇన్‌ఫెక్షన్ జీవితకాలం వారం, 2 వారాలే. తర్వాత క్రమేణా శరీరంలో ప్రభావం తగ్గిపోతుంది. వైరస్ సోకినవారిలో 85% మందిలో ఎటువంటి ప్రమాదం ఉండదు. కరోనా సోకినా.. వారిలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఆ వ్యక్తికి తెలియకుండానే వైరస్ సోకి తగ్గిపోవచ్చు కూడా. కొంతకాలం తర్వాత శరీరంలో యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయి. కేవలం 15% మందికే లక్షణాలు కనిపించడం, కొంత తీవ్రత పెరగడం వంటివి చూస్తున్నాం. ఇందులోనూ 5% మందికే ఐసీయూలో చికిత్స అందించాల్సి వస్తోంది. అందుకే అవగాహనతో ధైర్యంగా ఉంటే సగం కరోనాని జయించినట్లే. కొవిడ్ కొత్త జబ్బు కాబట్టి శాస్త్రపరమైన అవగాహన కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది.
ఇంట్లోనే నయం చేసుకోవచ్చు.. ఎలా అంటే..
కరోనా బాధితులు 5 రకాలు లక్షణాలు... లేనివారు, అతి స్వల్ప, స్వల్ప లక్షణాలున్నవారు, మధ్యస్థ లక్షణాలున్నవారు...తీవ్ర లక్షణాలున్నవారు...పరిస్థితి విషమించినవారు. వీరిలో లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని, పరిస్థితి విషమించినవారిని, మధ్యస్థ లక్షణాలున్నవారికి మాత్రమే ఆసుపత్రిలోనే చేర్చి, చికిత్స అందించాల్సి ఉంటుంది. మిగతా వాళ్లు కాస్త జాగ్రత్తలు తీసుకుని.. వంటింటి చిట్కాలు పాటిస్తే...ఇంట్లోనే కరోనాతో పోరాడి విజయం సాధించవచ్చు. కొవిడ్ వైరస్ సాధారణంగా శ్వాస వ్యవస్థలోకి ప్రవేశించి, తేలికపాటి గొంతునొప్పి నుంచి జ్వరం వంటి సమస్యలే తెచ్చిపెడుతుంది. చాలామందిలో తేలికగానే తగ్గిపోతుంది కూడా. ఈ విషయం గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది.
నచ్చిన పుస్తకాలు చదవండి
స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయితే...ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుంది. కానీ...ఐసొలేషన్‌లో ఉన్నప్పుడు...ఎంత ధైర్యంగా, అప్రమత్తంగా ఉంటే...అంత తొందరగా శరీరం నుంచి వైరస్‌ను బయటకు పంపేయొచ్చు. భయాందోళనలతో రోగ నిరోధకత శక్తి తగ్గుతుంది. అందుకే.. మనసు ప్రశాంతంగా ఉంచే అంశాలపై దృష్టి పెట్టాలి. నచ్చిన పుస్తకాలు చదువుకోవాలి.
వాటి జోలికి అస్సలు వెళ్లొద్దు
ఎక్కువగా కొవిడ్ వార్తలు చూడొద్దు. మరణాల గురించి దృశ్యాలు చూస్తే అనవసర ఆందోళనలు కలుగుతాయి. మనసుకు హాయినిచ్చే సంగీతం వినండి. నచ్చినవారితో వీడియో కాల్స్‌లో మాట్లాడాలి. రోజూ బీపీ, జ్వరం, రక్తంలో ఆక్సిజన్ ఎంత ఉంది...ఆయాసం వస్తోందా..? కళ్లు తిరుగుతున్నాయా? ఇలాంటివి పరీక్షించుకోవాలి.
సహజీవనం చేయాల్సిన పరిస్థితి
జలుబు, దగ్గు, గొంతునొప్పి లక్షణాలున్నప్పుడు నిత్యం 3పూటలా ఆవిరి పట్టాలి. రోగ నిరోధక శక్తి పెంపొందించే ఆహారాలు తీసుకోవాలి. పాజిటివ్ వచ్చిన వారిలో 10 రోజుల తర్వాత లక్షణాలేమీ లేకపోతే మళ్లీ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. కొవిడ్‌తో పాటు సహజీవనం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరి పనులు వారు చేసుకోవాల్సిందే. కార్యాలయాలకు వెళ్లాల్సిందే. ఇలాంటప్పుడు కొవిడ్ బారిన పడకుండా... ఆందోళన చెందకుండా ఎవరికి వారు స్వీయ రక్షణ పొందడమే చాలా కీలకం. ఒక గది, ప్రాంతంలో ఒకరి కంటే ఎక్కువమంది ఉన్నచోట ఒకరిలో కరోనా సోకితే.. పాజిటివ్ వ్యక్తితో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించి వారిని క్వారంటైన్‌లో ఉంచాలి. ఆ ప్రాంతాన్ని డిస్‌ఇన్‌ఫెక్షన్ చేసి, తిరిగి ఆ ప్రాంతాన్ని వినియోగించుకోవచ్చు. మొత్తం భవనాన్ని మూసివేయాల్సిన అవసరం లేదు.
వీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి
లక్షణాలు రావడానికి 2 రోజుల ముందు నుంచి ఎవరెవరిని కలిశారో.. అప్పట్నించి ఐసోలేషన్‌కు వెళ్లే వరకూ ఎవరెవరి దగ్గరకు వెళ్లారో.. వారందరూ కాంటాక్టు వ్యక్తుల కిందకే వస్తారు. వీరందరూ క్వారంటైన్‌లో ఉండాల్సిందే. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, వృద్ధులు మాత్రం 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండడంతో పాటు పరీక్షలు చేయించుకోవాలి. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని ఆరోగ్యవంతులు యథావిధిగా పనులు చేసుకోవచ్చు. అయితే వీరిలో 14 రోజుల పాటు లక్షణాలు పరిశీలిస్తుండాలి. 65 ఏళ్లకు పైబడినవారు, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బు, మూత్రపిండాల జబ్బు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు ఇంటి వద్ద ఉండడమే మేలు. వారికి ఇంటి వద్ద నుంచి పనిచేయడానికి అనుమతించాలి.
మనవారే అని ఉదారత వద్దు... భౌతిక దూరం ముద్దు
కార్యాలయాల్లో కనీసం 6 అడుగుల దూరం పాటించాలి. పని ప్రదేశాల్లో గుంపులుగా ఉండొద్దు. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి. కనీసం 40-60 సెకన్ల పాటు చేతులను సబ్బుతో శుభ్రపర్చుకోవాలి. ఒకవేళ ఆల్కాహాల్ ఆధారిత శానిటైజర్‌తో అయితే 20 సెకన్ల పాటు శుభ్రపర్చుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు లేని వారిని మాత్రమే కార్యాలయాల్లోకి అనుమతించాలి. ఉద్యోగులందరూ ఒకే సమయంలో భోజనాలు చేయకుండా వేళలు మార్చాలి. కార్యాలయాల్లో క్రమం తప్పకుండా శానిటైజేషన్ ప్రక్రియ నిర్వహించాలి. తగిన జాగ్రత్తలు, వైద్యంతోపాటు ఆత్మవిశ్వాసం చూపి కరోనాను సులభంగా జయించామని కొవిడ్-19 బారిన బయటపడిన వారు చెబుతున్నారు. కాస్త అప్రమత్తంగా ఉంటే చాలు ఆపద నుంచి సులువుగా తప్పించుకోవచ్చు.
ఇదీ చదవండి: ప్రాణం పోవటమే తప్ప వ్యాక్సిన్ లేదు