రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న 2 ఒప్పందాల్లో ఒకదాని నుంచి వైదొలగనున్నట్లు సమాచారం. తిరుపతి సమీపంలో రూ.15వేల కోట్లతో ఏర్పాటు చేయదలచిన ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి పరిశ్రమ (మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్) ఆలోచనను విరమించుకున్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసిందని రాష్ట్ర పరిశ్రమలశాఖ అధికారులు తెలిపారు. ఈ యూనిట్‌కు అప్పటి ప్రభుత్వం భూములను కేటాయించగా కొంతమేరకు కోర్టు కేసుల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
నవ్యాంధ్రలో రూ.52వేల కోట్లతో 2 పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి గత తెదేపా ప్రభుత్వం, రిలయన్స్ సంస్థల మధ్య అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూలు) కుదిరాయి. వాటిలో తిరుపతి సమీపంలో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి పరిశ్రమ ఒకటి కాగా.. కాకినాడ సమీపంలో చమురు, సహజవాయు నిక్షేపాలు వెలికితీసే ప్రాజెక్టు రెండోది. మొదటి ప్రతిపాదన నుంచి వెనక్కి తగ్గిన ఆ సంస్థ.. కాకినాడ సమీపంలో కృష్ణా-గోదావరి బేసిన్‌లో చమురు, సహజవాయు నిక్షేపాలు వెలికి తీసేందుకు కుదుర్చుకున్న ఒప్పందాన్ని కొనసాగించేందుకు సుముఖంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ భాగస్వామ్యంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో ప్రతిపాదించిన పెట్టుబడులు రూ.37 వేల కోట్లు.
ఇప్పటివరకు 75 ఎకరాలు అప్పగింత
తిరుపతి సమీపంలో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు రిలయన్స్ సంస్థకు గత ప్రభుత్వం 150 ఎకరాలు కేటాయించింది. వైకాపా అధికారంలోకి వచ్చాక 75 ఎకరాలను అప్పగించినట్లు అధికారులు తెలిపారు. అయితే.. 15మంది రైతులు వివిధ కారణాలతో కేసులు దాఖలు చేసినందున 150 ఎకరాల్లో సుమారు 50 ఎకరాలు వివాదాల్లో చిక్కుకున్నాయనీ.. అలాంటి భూములన్నీ వేర్వేరుచోట్ల ఉన్నాయని పేర్కొన్నారు.
''గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమల ఏర్పాటుకు అనేక ఎంవోయూలు జరిగాయి. వాటిలో చాలామంది ముందుకు రావడంలేదు. రిలయన్స్ పరిస్థితీ అలాగే ఉంది. ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను విరమించుకుంది. దాని వెనుక కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి. మేం వారితో సంప్రదిస్తున్నాం. వాళ్లే ఆసక్తి చూపడం లేదు. ఎంవోయూలు చేసుకున్న అందరితో మేం మాట్లాడుతున్నాం. ఇప్పటికే భూములు తీసుకున్నవారిని.. పరిశ్రమ ఏర్పాటు చేసే ఆలోచన ఉందో లేదో చెప్పాలని గట్టిగా అడుగుతున్నాం. ఆ విషయంలో ముఖ్యమంత్రి జగన్ చాలా స్పష్టంగా ఉన్నారు. పరిశ్రమలకు కేటాయించిన భూముల్ని కచ్చితంగా వినియోగంలోకి తేవాలని సీఎం చెప్పారు'' అని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి..