జాతీయ ప్రాధాన్యం ఉన్న విద్యాసంస్థలతో కలిపి రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు 47 ఉండగా వీటిల్లో 14 సంస్థలకే గుర్తింపు ఉందని నేషనల్ అసెస్‌మెంట్, అక్రెడిటేషన్ కౌన్సిల్ తన నివేదికలో పేర్కొంది. ఏపీ నాణ్యత వాస్తవ పత్రం (క్వాలిటీ ఫ్యాక్ట్‌షీట్), సిఫార్సుల నివేదికను కౌన్సిల్ విడుదల చేసింది. ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పడిన జేఎన్‌టీయూ అనంతపురం, ఆర్జీయూకేటీ, విక్రమసింహపురి, కృష్ణా, ఆదికవి నన్నయ్య వర్సిటీలకు ఇప్పటికీ న్యాక్ గుర్తింపు లేదు.
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలకు న్యాక్ గుర్తింపు లభించాలంటే ముందుగా బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఏ సంస్థ నుంచీ ఉపకార వేతనాలు అందని పరిశోధక అభ్యర్థులకు ప్రతి నెలా ఉపకారవేతనాలు అందించాలని సూచించింది. ఈ విద్యా సంవత్సరంలో పరిశ్రమలతో విద్య, పరిశోధన అనుసంధానాన్ని ఉన్నత విద్యాసంస్థలు, వర్సిటీలు ప్రారంభించాలని న్యాక్ లక్ష్యంగా నిర్ణయించింది. విద్యాసంస్థలు ఉద్యోగులను తయారుచేయడం కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారిని రూపొందించేలా కరిక్యులమ్ అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు..
ఉన్నత విద్యాసంస్థల సమగ్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపైనా ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, వీటి అమలుపై ప్రభుత్వం పర్యవేక్షించాలని సూచించింది. విద్యలో నాణ్యతను మెరుగుపరిచేందుకు సంస్థలకు అక్రెడిటేషన్ తప్పనిసరి చేయాలని, విద్యార్థులకు మౌలికసదుపాయాలు కల్పించాలని సిఫార్సు చేసింది.
ప్రాజెక్టు వర్క్స్ తప్పనిసరి..
విశ్వవిద్యాలయాలు పాఠ్యప్రణాళికలో ప్రాజెక్టు వర్క్స్‌ను తప్పనిసరి చేయాలని, ప్రాక్టికల్ అనుభవం విద్యార్థులకు అందించాలని న్యాక్ కౌన్సిల్ సూచించింది. వర్సిటీలు అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను ఉపయోగించుకొని పరిశోధన, మౌలికసదుపాయాల నిర్వహణను మెరుగుపర్చుకోవాలని సూచించింది. ఇతర రాష్ట్రాలు, విదేశీ విద్యార్థులను ఆకర్షించేలా విధానాలు ఉండాలని, పరిశోధనలకు ప్రోత్సాహం అందించడంతోపాటు ప్రముఖ జర్నల్స్‌లో పరిశోధన పత్రాలను ప్రచురించేలా సహకారం అందించాలని సూచించింది. ప్రైవేటు, డీమ్డ్ టుబీ విశ్వవిద్యాలయాలు అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే ఫీజులతో నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని వెల్లడించింది.