తెలంగాణలోని భాగ్యనగరం మహాగణపతి ఉత్సవాల్లో కీలకఘట్టమైన బాలాపూర్ లడ్డూ వేలంపాటలో.. లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డూను 18.90 లక్షలకు మర్రి శశాంక్‌రెడ్డి, రమేశ్ యాదవ్‌లు దక్కించుకున్నారు. లడ్డూ వేలంపాటను కోనేటి లక్ష్మణరావు ప్రారంభించారు. 2019లో బాలాపూర్ లడ్డూ 17.60 లక్షలకు కొలను రాంరెడ్డి దక్కించుకున్నారు.
1994 నుంచి కొనసాగుతున్న బాలాపూర్ లడ్డూ వేలం పాట గతేడాది కరోనా వ్యాప్తి వల్ల జరగలేదు. ఈయేడు రెట్టింపు ఉత్సాహంతో వేలంపాటలో పాల్గొనడానికి భక్తులు ఆసక్తి చూపుతున్నారు. బాలాపూర్ లడ్డూ వేలంపాటకు కొలను రాంరెడ్డి హాజరయ్యారు. 2019లో రూ.17.60 లక్షలకు ఈయన లడ్డూను దక్కించుకున్నారు. ఆ నగదును ఉత్సవ సమితి రాంరెడ్డికి అందించింది. వేలంపాటలో స్థానికులైతే డబ్బును మరుసటి ఏడాది చెల్లిస్తారు. స్థానికేతరులకు మాత్రం అప్పటికప్పుడు డబ్బు చెల్లించేలా నిబంధనలు ఉన్నాయి.
బాలాపూర్ లడ్డూ వేలంపాటకు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కడప జిల్లా ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఖైరతాబాద్ మహాగణపతి తర్వాత అంత ప్రాధాన్యం కలిగింది బాలాపూర్ గణేశుడికే. నగరంలోని ప్రధాన వీధుల గుండా భజన బృందం పాటలు, డప్పుచప్పుళ్ల సందడి మధ్య బాలాపూర్ గణపతికి ఊరేగింపు నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని వేలంలో పాల్గొన్నట్లు లడ్డూ దక్కించుకున్న వారిలో ఒకరైన ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ అన్నారు. శశాంక్‌రెడ్డితో కలిసి లడ్డూను దక్కించుకున్నట్లు తెలిపారు. ఏపీ సీఎం జగన్‌కు లడ్డూను కానుకగా ఇవ్వాలనే వేలంలో పాల్గొన్నానని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.