Ramoji Foundation: సామాజిక బాధ్యతలో భాగంగా.... రామోజీ ఫౌండేషన్ మరో ముందడుగు వేసింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లిలో పంచాయతీ కార్యాలయ భవనాన్ని నిర్మించింది. ఆధునిక వసతులు, సాంకేతిక సౌకర్యాలతో కూడిన నూతన భవనాన్ని రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రారంభించారు. పంచాయతీ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
మా నియోజకవర్గమైన ఇబ్రహీంపట్నంలో రామోజీ ఫిలిం సిటీ ఉన్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. రామోజీ ఫౌండేషన్ ద్వారా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నా నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో చేస్తున్న శుభ సందర్భంలో నేను చాలా గర్వపడుతున్నాను. గ్రామీణ అభివృద్ధి కోసం రామోజీ సంస్థ... ఫౌండేషన్ ద్వారా అన్ని కార్యక్రమాలు చేస్తోంది. ఈ నాగన్‌పల్లి ఊరిని దత్తత తీసుకొని... వివిధ రకాల అభివృద్ధి పనులు చేసేందుకు సహకారం అందించిన రామోజీరావు గారికి ధన్యవాదాలు. నా నియోజకవర్గంలో అభివృద్ధిలో వాళ్లు మొదటిదశలో పనిచేస్తున్నందున వారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.
-మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తెలంగాణ శాసనసభ్యుడు
రామోజీ ఫౌండేషన్.... నాగన్‌పల్లి గ్రామాన్ని 2016లో దత్తత తీసుకుంది. అప్పటి నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. దాదాపు రూ.15 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
మా నాగన్‌పల్లి గ్రామ చరిత్రలో ఒక మంచిరోజు. రామోజీ ఫౌండేషన్ ద్వారా మా నాగన్‌పల్లిలో... గ్రామానికే తలమానికగా నిలిచే విధంగా మెయిన్ రోడ్డులో పంచాయతీ పాత భవనాన్ని తీసేసి... జీప్లస్2 నూతన భవనాన్ని మాకు కానుకగా ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా గ్రామాన్ని దత్తత తీసుకొని... ఊరు సర్వతోముఖాభివృద్ధికి రామోజీ ఫౌండేషన్ పాటుపడడం మా అదృష్టంగా భావిస్తున్నాం. -జగన్, సర్పంచ్, నాగన్‌పల్లి
పాఠశాల భవనం, ఎస్సీ సామాజిక భవనం, అంగన్‌వాడీ కేంద్రాలు, రక్షిత మంచి నీటి పథకం, ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మించారు. కోటి రూపాయల వ్యయంతో ఇప్పుడు పంచాయతీ భవనాన్ని నిర్మించారు. కొత్తగా వైకుంఠధామాలనూ నిర్మిస్తున్నారు.
ఈ మండలంలోనే కాదు జిల్లాలోనే ఎక్కడాలేని విధంగా కార్పొరేట్ స్థాయిలో స్కూల్‌ను కట్టించారు. అంగన్‌వాడీ భవనం, సీసీ రోడ్లు, ఇంటింటికీ మరుగుదొడ్లు, గ్రామపంచాయతీ భవనం కట్టించారు. ఇంతమంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న రామోజీ ఫౌండేషన్‌కు ధన్యవాదాలు. వాళ్లకు ఎల్లవేళలా మేం రుణపడి ఉంటాం. - మంగ, ఎంపీటీసీ, నాగన్‌పల్లి
ఇదీ చదవండి: Ramoji Film City Winter Carnival : రారండోయ్ రామోజీ ఫిలిం సిటీ చూద్దాం