కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో.. ఈ నెల వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 2022 మార్చి వరకు హిందూ మహాసముద్రంపై లానినో ప్రభావం కొనసాగే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో.. సముద్ర ఉపరితల పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
తమిళనాడు, శ్రీలంక తీరాలకు పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం.. బుధవారం నాటికి ఆగ్నేయ అరేబియా సముద్రం మీదకు ప్రవేశించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ‘ఉత్తర వాయవ్యదిశగా ప్రయాణించి.. తర్వాత 48 గంటల్లో బలపడుతుంది. కొమరిన్, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల మీద నుంచి పశ్చిమమధ్య బంగాళాఖాతం, దక్షిణకోస్తా తీరం వరకు ఉపరితల ద్రోణి వ్యాపించింది. వీటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురవొచ్చు’ అని సూచించారు.
ముసురు వాతావరణం
రెండు రోజులుగా రాష్ట్రంలో ముసురు వాతావరణం నెలకొంది. చలిగాలులు వీస్తున్నాయి. అధికశాతం మండలాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా చినుకులు పడుతూనే ఉన్నాయి. మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల వానలు కురిశాయి. పలు ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల మధ్య.. అత్యధికంగా కపిలేశ్వరపురం మండలం అంగరలో 5.7 సెం.మీ., అల్లవరం మండలం బెండమూరు లంకలో 4.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
- సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 మధ్య నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మిగిలిన జిల్లాల్లోనూ ఒక మోస్తరు వానలు పడ్డాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లా అల్లూరులో 17.5 సెం.మీ, తూర్పుగోదావరి జిల్లా శంఖవరంలో 11.5, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 11.4 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది.
ఇదీ చదవండి: