RAINS: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
శ్రీసత్యసాయి జిల్లా: మడకశిరతోపాటు చుట్టుపక్క ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. బుధవారం రాత్రి మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. మడకశిరలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. చాలా సేపటి వరకు వాహనాల రాకపోకలు నిలిచాయి. అరేపేట వీధిలోని లోతట్టు ప్రాంతంలో... ఇళ్లలోకి వర్షపు నీరు చేరి... ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షాలు కురిస్తే చాలు అగచాట్లు పడాల్సి వస్తోందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.
*కర్ణాటకలో భారీ వర్షాలతో....హిందూపురం పరిధిలో పెన్నానది పరవళ్లు తొక్కుతోంది. పోచంపల్లి వద్ద మరమ్మతులకు గురైన బ్రిడ్జ్ మరింత కుంగిపోవడం వల్ల....వాహనాల రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. నీటి రాకతో....చాలా చెరువులు నిండే అవకాశం ఉందని....స్థానికులు అంటున్నారు. అయితే...నదీపరివాహక ప్రాంతంలో పలు గ్రామాల్లో పంట పొలాలు మునిగాయి.
కర్నూలు జిల్లా: కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో భారీ వర్షం కురిసింది. వర్షం నీటితో ఊరివంక పొంగిపొర్లుతోంది. దీంతో హాలహర్వి-నిట్రవట్టి మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హాలహర్వి మండలంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. హాలహర్వి-గూళ్యం రహదారి కోతకు గురై... ప్రమాదకరంగా మారింది.
*హోలగుందలో పిడుగుపాటుతో...తండ్రీకుమారుడు ప్రాణాలు కోల్పోయారు. B.C.కాలనీలో బుధవారం రాత్రి 9గంటలకు.....ఘటన జరిగింది. తండ్రి సిద్ధిక్ సాబ్, హుస్సేన్ సాబ్ మృతి చెందడంతో...స్థానికంగా విషాదం నెలకొంది. క్రిష్ణగిరి మండలం కోయిలకొండలో పిడుగుపాటుతో.....రెండు ఆవులు మృతి చెందాయి.
అనంతపురం జిల్లా: ఉరవకొండ మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పంటపొలాలు నీట మునగ, రోడ్లు జలమయమయ్యాయి. పట్టణంలోని అనంతపురం-బళ్లారి జాతీయ రహదారి వద్ద కేకే పెట్రోల్ బంకు ఎదురుగా వర్షపు నీరు నిలిచిపోయి చెరువును తలపిస్తుంది. ఉరవకొండ గురుకుల విద్యాలయంలో ఉండే ఇంటర్ విద్యార్థినులను పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్తున్న బస్సు బురదలో ఇరుక్కుపోయింది. విడపనకల్ మండలం డోనేకల్ వాగు పొంగి పొర్లడంతో కొద్దీ సేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఎన్టీఆర్ జిల్లా: విజయవాడలో ఒక్కసారిగా వాతావారణం మారింది. వాతావరణం చల్లబడి...30 నిమిషాలపాటు చిరుజల్లులు కురిశాయి. రోడ్ల మీద వర్షపు నీరు ఆగింది. వాన కురవడం వల్ల....వారం రోజుగా వేడి గాలులతో అల్లాడుతున్న ప్రజలకు...కాస్త ఉపశమనం లభించినట్లైంది.
నంద్యాల జిల్లా: డోన్‌లో న్యాయమూర్తి ఇంటి ఆవరణంలో చెట్టుపై పిడుగు పడింది. సమీపంలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది.
ఇవీ చదవండి: