ETV Bharat / city

ASANI CYCLONE: "అసని" అలజడి... రాష్ట్రంలో భారీ వర్షాలు - బాపట్లలో వర్షాలు

ASANI CYCLONE: రాష్ట్రంలో అసని తుపాన్ తీవ్ర అలజడి సృష్టిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్రతుపాన్​.. బలహీనపడి తుపాన్​గా మారింది. చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులుతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈదురుగాలుల ప్రభావంతో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది.

ASANI CYCLONE
"అసని" అలజడి... రాష్ట్రంలో భారీ వర్షాలు
author img

By

Published : May 11, 2022, 10:49 AM IST

Updated : May 11, 2022, 2:28 PM IST

ASANI CYCLONE: ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్రతుపాన్​.. బలహీనపడి తుపాన్​గా మారింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షంతో చాలా చోట్ల వరి పంట నీట మునిగింది.

"అసని" అలజడి... రాష్ట్రంలో భారీ వర్షాలు

పశ్చిమగోదావరి జిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను ప్రభావంతో.. పశ్చిమగోదావరి జిల్లాలో తీరం అల్లకల్లోలంగా మారింది. తీరంలోని పీఎం లంక, సీఎం లంక, కెపీపాలెం, పేరుపాలెం ప్రాంతంలో అలల ఉద్ధృతి భారీగా పెరిగింది. కెరటాల ధాటికి పీఎంలంకలో కొబ్బరి, సర్వి తోటలు కోతకు గురవుతున్నాయి. చిరుజల్లులు, సముద్రపు పోటుతో ఉప్పుముడులు నీటమునిగాయి. వర్షంతో చాలా చోట్ల వరి పంట నీట మునిగింది.

కాకినాడ జిల్లా: జిల్లాపై అసని ప్రభావం చూపే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. కాకినాడ- ఉప్పాడ తీరంలో పరిస్థితిని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు. బీచ్ రోడ్ లో స్థానిక మత్స్యకార కుటుంబాలతో చర్చించిన ఆయన...అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోనసీమ జిల్లాలో వరి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంటలు కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.
కృష్ణా జిల్లా: అవనిగడ్డ నియోజకవర్గంలో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. హంసలదీవి వద్ద సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. హంసలదీవి బీచ్ గేట్లను మెరైన్ పోలీసులు మూసివేశారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో కంట్రోల్ రూంలను రెవిన్యూ అధికారులు ఏర్పాటు చేశారు.

*మచిలీపట్నం సహా పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తోంది. మచిలీపట్నం వద్ద సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది. ఐదు మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి.

*దివిసీమలో అసని తుపాను ప్రభావంతో భారీగా వీస్తున్నాయి. మోపిదేవి, చల్లపల్లి, మండలాల్లో అరటి తోటలు, మునగ తోటలు, బొప్పాయి తోటలు నేలకొరిగాయి. మామిడి కాయలు రాలిపోవడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ గాలులకు రోడ్ల పై తాడి చెట్లు, వృక్షాలు విరిగి పడ్డాయి, నిన్న సాయంత్రం నుండి ముందస్తు చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈరోజు ఉదయం సరఫరా పునరుద్ధరింారు. వర్షం తక్కువగా ఉన్నప్పటికీ గాలుల ప్రభావంతో రైతులకు నష్టం వాటిల్లింది. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి అధికారులు పరిస్థితి ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా: అసని తుపాను నేపథ్యంలో.. శ్రీకాకుళం జిల్లాలో సాధారణ పరిస్థితులు వస్తున్నాయి. జిల్లాలో కొన్ని చోట్ల రాత్రి వర్షం కురిసింది. ఉదయం నుంచి శ్రీకాకుళం, ఆమదాలవలస, సరుబుజ్జిలి, లావేరు, గార, వజ్రపుకొత్తూరు మండలాల్లో తేలికపాటి వాన పడింది. తీర ప్రాంతాల్లో సముద్రపు అలల తాకిడి జోరుగా ఉన్నాయి. తుపాను దృష్ట్యా కలెక్టరేట్ తోపాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్... జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం ఉంచారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

కడప: అసని తుపాను ప్రభావంతో కడపలో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, అంబేడ్కర్ కూడలి, కోర్టు రోడ్డుపై భారీగా వర్షపు నీరు చేరింది. బస్టాండ్ ఆవరణలో వర్షపు నీరు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బాపట్ల జిల్లా: అసని తుపాన్ కారణంగా బాపట్ల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్ పరిస్థితులపై కలెక్టర్ కె.విజయ కృష్ణన్ ఎప్పటికప్పుడు తీరప్రాంతంలోని అధికారులతో చర్చిస్తున్నారు. చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. తుపాన్ కారణంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చీరాల, వేటపాలెం, చినగంజాం తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోలు రూములు ఏర్పాటుచేశారు.. బాపట్లలో 8 సెం.మీ., వేటపాలెంలో 5.54 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

*నిజాంపట్నం హార్బర్‌లో హెచ్చరికలు జారీ చేశారు. బాపట్ల, చీరాల ఆర్డీవో కార్యాలయాలతోపాటు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. మత్స్య కారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. దుగ్గిరాలలో మొక్కజొన్న రైతులు ఆవేదన చెందుతున్నారు. రేపల్లె తీర ప్రాంతంలోఅధికారులు పోలీసులతో గస్తీ ఏర్పాటు చేశారు.

కర్నూలు జిల్లా: అసాని తుపాను ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు, డోన్‌, రుద్రవరం, బేతంచర్ల తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై జల్లులు కురుస్తుండటంతో ఎండల నుంచి ఉపశమనం లభించింది..

తిరుపతి జిల్లా: నాయుడుపేట పరిసరాల్లో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఉద్యానవన, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వర్షంతో పాటు ఈదురుగాలులు వీయడంతో చెట్లు నేలవాలాయి. ఉద్యావన పంటలకు వేసిన షెడ్డులు, పందిర్లు పడిపోయాయి. వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు.

అనకాపల్లి జిల్లా: అసని ప్రభావంతో అనకాపల్లి జిల్లా రోలుగుంట, కశింకోట, కోటవురట్లలో కుండపోత వర్షం కురుస్తోంది. రోలుగుంట మండలంలో నిన్న ఉదయం నుంచి అధికారులు విద్యుత్‌ నిలిపివేశారు.

విజయనగరం: అసని తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో మోస్తరు వర్షం కురుస్తోంది. పూసపాటిరేగలో అత్యధికంగా 6.5 సెం.మీ. నమోదవ్వగా, వంగరలో అత్యల్పంగా 1.2 సెం.మీ, వర్షపాతం నమోదైంది. గంట్యాడలో 6.2, మెంటాడలో 5.4 సెం.మీ, బొండపల్లిలో 4.8, ఎస్.కోటలో 4.7 సెం.మీ, విజయనగరంలో 4.5, డెంకాడలో 4 సెం.మీ, రాజాం, సంతకవిటి మండలాల్లో 2 సెం.మీ, రేగిడి ఆమదాలవలసలో 2.3 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.

కోనసీమ: తుపాన్ ప్రభావంతో కోనసీమలో వర్షాలు కురుస్తున్నాయి. మలికిపురంలో అత్యధికంగా 4.96 సెం.మీ, ఆత్రేయపురంలో అత్యల్పంగా 1.14 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

ప్రకాశం జిల్లా: మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. టంగుటూరులో అత్యధికంగా 7.2 సెం.మీ, జరుగుమిల్లిలో 7 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

ఇవీ చదవండి: తిరుపతి-మదనపల్లి జాతీయ రహదారిపై స్తంభించిన రాకపోకలు.. వాహనాల దారి మళ్లింపు

Last Updated : May 11, 2022, 2:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.