Floods in Andhra Pradesh: నాలుగు రోజులుగా వర్షాల కారణంగా రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇళ్లు, రోడ్లపైకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరదల వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి బహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఇళ్లలోకి చేరిన వరద నీరు: ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ఇంటి నుంచి బయటకు రావడానికి వీలు లేకుండా ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని రామ కాలనీలో ఇళ్ల చుట్టూ వరద నీరు చేరింది. దీంతో ఇళ్ల నుంచి బయటకు రాలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ వరదనీరు ఇళ్లలో చేరడం వల్ల కొందరు విద్యుత్ మోటర్ల సాయంతో నీటిని బయటకు పంపిస్తున్నారు. నిత్యావసర సరుకులకు ఇబ్బంది పడుతున్నామని సాలూరు పట్టణ ప్రజలు అంటున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలకు ఈ వరద నీటి వల్ల ప్రమాదం ఉందని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుకుంటున్నారు.
పంట నష్టపోయిన రైతులు: పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట మండలంలోని వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు తడిసిపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంట వర్షానికి తడిసింది. వర్షానికి పత్తి పంట తడిసిపోయింది.. దీంతో పత్తి రైతులు నష్టపోయామని వాపోతున్నారు. వరినాట్లు నీట మునిగిపోయాయి. వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాలూరు మండలం జిగిరాం గ్రామ పరిసర ప్రాంతాలలోని ఇళ్లలో వరదనీరు చేరింది.
విశాఖలో రోడ్డుపైకి చేరిన వరద నీరు: విశాఖ జిల్లా భీమిలి జోన్ పరిధి తగరపువలస జాతీయ రహదారి పక్కన భారీగా వరద నీరు చేరింది. కాలువలు నిండి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్డుపై వరదనీరు చేరటంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు సత్యనారాయణ స్వామి కొండపై ఉన్న మట్టి జారిపోవడంతో స్థానికులు ఆందోళన గురయ్యారు. పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. జాతీయ రహదారి సిబ్బంది జీవీఎంసీ జోనల్ సిబ్బందికి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం సత్యనారాయణ స్వామి కొండవాలు ప్రాంతం చిల్లపేట చెరువు తదితర లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. దీంతో ఈ స్థలాన్ని పరిశీలించి వాళ్లకు రూ.60 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మాజీ మంత్రి అవంతి తెలిపారు. త్వరితగతిన పనులు చేపట్టాలని.. వారం రోజుల్లోపు కొండపైన ఉన్న ఇళ్లకు వెళ్లేందుకు మెట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదకర స్థాయిలో బహుద నది: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బహుద నదికి వరద నీరు ప్రమాదకర స్థాయిలో చేరింది. నది పరివాహక గ్రామాల ప్రజలు వరదముప్పు పొంచి ఉందని భయాందోళనకు గురవుతున్నారు. నదిని అనుకుని ఉన్న వాగులు ఉప్పొంగుతుండడంతో వందలాది ఎకరాల పంటలు నీట మునిగాయి. రక్తకన్న వద్ద బీమ్ సముద్రం వాగు పొంగిపొర్లడంతో రక్తకన్న, మండపల్లి, తేలుకుంచి, హరిపురం గ్రామాల పరిధిలో వందలాది ఎకరాల పంటలు నీట మునిగిపోయాయి. ఇన్నిసుపేట గ్రామం వద్ద పద్మనాభ వాగు పొంగి పొర్లడంతో ఇన్నిసుపేట, తులసిగాం, ధర్మపురం తదితర గ్రామాల పరిధిలో వందలాది ఎకరాలు నీట మునిగాయి. ఇన్నిసుపేట గ్రామం జలదిగ్బంధమైంది. వాగు ప్రవహం తగ్గకపోవటం వల్ల ఆదివారం ఉదయం నాటికి ఈ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బహుదానదికి ఈ రెండు రోజుల్లో సుమారు 14 వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది.
ఇవీ చదవండి: