రాగల 24 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాలతో పాటు రాయలసీమలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ప్రకాశం, తూర్పుగోదావరి, విశాఖ, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రస్తుతమిది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలియచేసింది.
మరోవైపు పశ్చిమగాలుల కారణంగా రాష్ట్రంలో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచనలు ఉన్నట్టు వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర , దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల, రాయలసీమలో చాలాచోట్ల వర్షాలకు ఆస్కారం ఉందని తెలియజేసింది. ప్రత్యేకించి నెల్లూరు, ప్రకాశం, తూర్పు, పశ్చిమగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: రాత్రి నుంచి కురుస్తున్న వర్షం..పొంగుతున్న వాగులు