కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఆనకట్టపై నుంచి వరద నీరు పొంగిపొర్లింది. భారీ వరద వస్తుండటంతో 17 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తారు. దిగువన ఉన్న 12 లోతట్టు గ్రామాలకు వరద చేరింది. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో కడెం జలాశయం పరిస్థితి గంటగంటకూ ఉత్కంఠగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని ప్రాజెక్టుల ప్రాంతాల్లోనూ అలజడి నెలకొంది. పోచంపాడు, శ్రీపాద ఎల్లంపల్లి జలాశయాల కింద కూడా ముంపు ఏర్పడుతోంది. దేవాదుల ప్రాజెక్టు మూడోదశలోని సొరంగం, పంప్‌హౌస్, సర్జిపూల్‌ను కూడా వరద తాకింది. మరో రెండు రోజులు భారీ వర్షసూచన ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
కడెం వద్ద ఉత్కంఠ: కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు. దీని నీటి మట్టం బుధవారం ఉదయం సమయానికి 699.70 అడుగులకు పెరిగింది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 7.26 టీఎంసీలు కాగా వందశాతం నిండింది. ఎగువ నుంచి వరద పెరుగుతూనే ఉంది. ప్రాజెక్టుకున్న 18 గేట్ల నీటి విడుదల సామర్థ్యం మూడు లక్షల క్యూసెక్కులు. అయితే, ఒక గేటు పూర్తిగా తెరుచుకోలేదు. విడుదల సామర్థ్యం కన్నా వరద ఎక్కువగా ఉండటంతో డ్యాం కట్ట పైనుంచి నీరు పొర్లిపోతోంది. కాల్వలకు కూడా రెండు చోట్ల గండ్లు పడ్డాయి. ఆనకట్ట వద్ద ప్రవాహ గేజ్‌ను కొలిచే గది నుంచి ఇంజినీర్లు కూడా బయటికి వచ్చేశారు. డ్యాం ప్రాంతం వద్ద ఉన్న భారీ సైరన్ మోగించి దిగువ గ్రామాల ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. సాయంత్రానికి వరద కొంత తగ్గుముఖం పట్టినా పొద్దుపోయే సమయం నుంచి మళ్లీ పెరిగింది. దిగువన మొత్తం 12 గ్రామాల్లో వరద నీరు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సీఎం కేసీఆర్ కడెం ప్రాజెక్టు పరిస్థితులపై ఎప్పటికప్పుడు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫోన్ చేసి సమీక్షించారు. మంత్రి ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మూడు రోజులుగా కడెం పరీవాహక ప్రాంతంలో కొన్ని చోట్ల దాదాపు యాభై సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది.
దేవాదుల పంపుహౌస్‌లోకి వరద: దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో దశలోని ప్యాకేజ్ -3లో పంపుహౌస్, సర్జిపూల్‌లోకి వరద నీరు చేరింది. ములుగు జిల్లా రామప్ప చెరువు నుంచి హనుమకొండ జిల్లా ధర్మసాగర్ వరకు ఈ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆసియాలోనే అతి పొడవైన సొరంగాన్ని జాకారం నుంచి దేవన్నపేట వరకు నిర్మించారు. దేవన్నపేట సమీపంలో నిర్మించిన పంపుహౌస్‌లో 31 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడు మోటార్లు ఏర్పాటు చేశారు. మోటార్లకు ముప్పు తప్పినప్పటికీ 49 కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగంలోకి వరద నీరు చొచ్చుకొచ్చి.. సర్జిపూల్, పంపుహౌస్‌లోకి ప్రవహించింది. యంత్రాలు, పరికరాలు నీట మునిగాయి.
వృద్ధుడి మృతి... ఇద్దరి గల్లంతు
- నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం వడ్యాల్ గ్రామంలో ఇల్లు కూలి ఏదుల చిన్నయ్య (65) అనే వృద్ధుడు మృతిచెందారు. ఆయన అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇల్లు కూలడంతో ప్రాణాలు కోల్పోయారు.
- కుమురం భీం జిల్లా దహెగాం మండలంలో సహాయక చర్యల్లో పాల్గొన్న మంచిర్యాల జిల్లాకు చెందిన రెస్క్యూ టీం సభ్యులు తెలిక సతీష్, అంబాల రాములు ఓ గర్భిణిని కాపాడే క్రమంలో గల్లంతయ్యారు.
వాహనం చెట్టుకు ఢీకొని ముగ్గురి మృతి: ఆసిఫాబాద్‌లోని కస్తూర్బా పాఠశాలలో చదువుకుంటున్న తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్దామని టాటా మ్యాజిక్ వాహనంలో ఎనిమిది మంది నిర్మల్ జిల్లావాసులు బయలుదేరారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం గోదరిగూడ వద్ద వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో సవిత (31), నాగమణి (45), అమృత్‌రావు (55) ప్రాణాలొదిలారు.
యాదాద్రి మాడ వీధుల్లో కుంగిన ఫ్లోరింగ్: ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు యాదాద్రి ప్రధానాలయం దక్షిణ మాడవీధిలో ఫ్లోరింగ్ బండలు కుంగాయి. కృష్ణశిలతో నిర్మించిన ఫ్లోరింగ్ వర్షం కురిసిన ప్రతిసారీ కుంగిపోతోందనే ఆరోపణలున్నాయి. హడావుడిగా పనులు చేయడం వల్లే లోపాలు వెలుగుచూస్తున్నాయని స్థానికులు, భక్తులు విమర్శిస్తున్నారు.
ఇవీ చూడండి