చాలామంది ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాలను ఎంచుకుంటున్నారని తెలంగాణ రైల్వే పోలీసులు వెల్లడించారు. వారిలో ఎక్కువమంది శివారు ప్రాంతాలకు వెళ్లి అక్కడ నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు. కరోనా వైరస్ కారణంగా కొద్దినెలలు మినహాయిస్తే.. మళ్లీ ప్రమాదాలు, మరణాల సంఘటనలు జరుగుతున్నాయని పోలీస్ అధికారులు అంటున్నారు. రాత్రివేళల్లో రైల్వే పోలీసుల పెట్రోలింగ్ లేకపోవడం ఆత్మహత్యలు పెరిగేందుకు ఓ కారణంగా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రైళ్ల కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకునే వారిలో ఎక్కువమంది డిగ్రీ, ఆపై చదువుకున్నవారే ఉంటున్నారు. ప్రాణాలు తీసుకునే ముందు వారు పరిసర ప్రాంతాలను గమనిస్తున్నారు. ఎవరూ లేనప్పుడే రైళ్ల కింద పడుతున్నారు.
నిర్లక్ష్యం... ఏమరుపాటు
- పట్టాలు దాటేవారిలో 65 శాతం మంది సెల్‌ఫోన్ మాట్లాడుతూ లేదా ఇయర్ ఫోన్లలో పాటలు వింటూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఖైరతాబాద్ రైల్వేగేట్ సమీపంలో ప్రమాదాల పరంపర కొనసాగుతోంది.
- 25శాతం మంది మద్యం మత్తులో రైలు వస్తున్నా గమనించకుండా దాటేసే క్రమంలో వాటి కిందపడి చనిపోతున్నారు.
- మిగిలిన పదిశాతం మంది రైలు వేగాన్ని అంచనా వేయడంలో విఫలమై... దూరంగా ఉంది కదా అంటూ దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రైలు వేగంగా వీరిని ఢీకొట్టడంతో మరణిస్తున్నారు.
‘‘ఫిబ్రవరి 7, 2021.. మౌలాలీ రైల్వేస్టేషన్‌కు దూరంగా ఉన్న పట్టాలపై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తున్నాడన్న సమాచారం వచ్చింది.. హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రెండు కిలోమీటర్లు వేగంగా పరిగెత్తి రైలు పట్టాలపై వెళ్తున్న యువకుడిని కాపాడాడు.’’
‘‘డిసెంబరు 27, 2020... ఘట్‌కేసర్ సమీపంలోని కొండాపూర్ రైల్వేగేట్ నుంచి పట్టాలపై ప్రైవేటు టీచర్ రాజేష్ వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు.. మూడు నిముషాల్లో రైలు వస్తుందని తెలుసుకున్న ఓ ప్రయాణికుడు పోలీసులకు ఫోన్ చేయగా.. బ్లూకోల్ట్ సిబ్బంది ప్రవీణ్‌గౌడ్, అబ్బాస్ అలీలు బైక్‌పై వేగంగా వెళ్లి రాజేష్‌ను పట్టాలపై నుంచి పక్కకు తప్పించారు..’’
ఇక్కడ ప్రమాదాలు..
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిధి: మల్కాజిగిరి, లాలాపేట, ఘట్‌కేసర్, చర్లపల్లి
- కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధి: ఫలక్‌నుమా, ఉమ్దానగర్
- నాంపల్లి రైల్వేస్టేషన్ పరిధి: ఖైరతాబాద్, బోరబండ, భరత్‌నగర్, హైటెక్ సిటీ, ఫతేనగర్, లింగంపల్లి
రైల్వే పట్టాలు ఆత్మహత్యలకు చిరునామాలుగా మారుతున్నాయని తెలుసుకున్న పోలీసులు వాటిని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు. పోలీసులు, రైల్వే అధికారుల చొరవ కారణంగా ఆత్మహత్యలు, ప్రమాదాలు తగ్గుతున్నాయని రైల్వే ఎస్పీ అనురాధ వివరించారు.
ఇదీ చూడండి: