భారతీయ రైల్వే డిజిటలీకరణలో భాగంగా మరో ముందడుగు వేసింది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించింది. ముఖ్యంగా సాధారణ టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులు క్యూ లైన్లలో నిలబడవలసిన అవసరం లేకుండా ఆటోమెటిక్ టికెట్ వెండిరగ్ మెషిన్లను (ఏటీవీఎమ్‌లు), కరెన్సీ ఆపరేటడ్ టికెట్ వెండిరగ్ మెషిన్లు (సీఓటీవీఎమ్‌లు) అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ కార్డులు కలిగిన ప్రయాణికులు ఇక మీదట భారతీయ రైల్వేకు సంబంధించిన వెబ్ పోర్టల్‌లో యూటీఎస్ ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో వారి కార్డులను రీఛార్జీ చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి అన్ని డిజిటల్ చెల్లింపులను అనుసంధానించింది. మొట్టమొదటిసారి స్మార్టు కార్డు పొందడానికి చిరునామాకు సంబంధించిన ధృవపత్రాలు మరియు ఇతర అవసరమైన వివరాలను అందజేయవలసి ఉంటుంది. అనంతరం, ప్రయాణికులు టికెట్లు పొందడానికి కనీసం రూ.100తో మొదటిసారి స్మార్ట్ కార్డు రీఛార్జీ చేసుకోవాలి.
గతంలో, స్మార్ట్ కార్డులో డబ్బులు అయిపోతే ప్రయాణికులు వారి స్మార్ట్ కార్డుల రీఛార్జీ కోసం ప్రతిసారీ బుకింగ్ కౌంటర్లకు రావలసి వచ్చేది. రైలు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు వారు డిజిటల్ పద్ధతిలో స్మార్టు కార్డులను రీఛార్జీ చేసుకునే వసతిని భారతీయ రైల్వే కల్పించింది. దీంతో ప్రయాణికులు బుకింగ్ కౌంటర్ల వద్ద క్యూలలో వేచి ఉండవలసిన అవస్త తొలగిపోనుంది. ముఖ్యంగా కొవిడ్ సమయంలో బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీని నివారించడానికి ఇది ఎంతగానో ఉపకరించనుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మాల్య అన్నారు.
* రీఛార్జీ చేసుకుని.. అకౌంట్‌లో డబ్బులు మినహాయించిన తర్వాత, ప్రయాణికులు సంబంధిత జోన్‌లోని ఏటీవీఎమ్‌ను 15 రోజులలో సందర్శించాలి. ఈ లోపు కార్డు గడువు ముగియనున్నట్లైతే.. గడువు లోగా తప్పక ఏటీవీఎమ్‌ను సందర్శించాలి.
* ప్రయాణికులు ఏటీవీఎమ్ రీడర్ వద్ద స్మార్టు కార్డులను పెట్టి ‘‘రీఛార్జీ స్మార్ట్ కార్డు’’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత ఏటీవీఎమ్‌లో ఆన్‌లైన్ రీఛార్జీ వివరాలు వస్తాయి. తదనుగుణంగా ఏటీవీఎమ్ స్మార్టు కార్డు రీఛార్జీ చేయబడుతుంది. దీంతో టికెట్ కొనుగోలుకు స్మార్ట్ కార్డును సంబంధిత రైల్వే జోన్‌లోని ఏదైనా ఏటీవీఎమ్‌లో వినియోగించుకునేందుకు సిద్ధమౌతుంది.
ఇదీ చదవండి: