రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఉపాధ్యాయులు, లెక్టరర్లు ఆందోళన చేశారు. కరోనా వల్ల జీతాలు లేక తమ కుటుంబాలను పోషించుకోలేక రోడ్డున పడ్డామంటూ వాపోయారు. ప్రభుత్వమే స్పందించి తమకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
విశాఖ జిల్లాలో..
అనకాపల్లిలోని ప్రైవేటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు నిరసన బాట పట్టారు. గత కొద్ది నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
గుంటూరు జిల్లాలో..
కరోనా మహమ్మారి వల్ల తాము ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని ప్రైవేటు సంస్థ ఉపాధ్యాయులు ఆవేదన చెందారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతూ గుంటూరు డీఈవో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అన్ని వర్గాల వారిని ఆదుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఉపాధ్యాయులను మాత్రం నిర్లక్ష్యం చేసిందని ప్రైవేటు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు హేమచంద్రబాబు అన్నారు.
ప్రకాశం జిల్లాలో..
కనిగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్లకార్డులతో ర్యాలీలు నిర్వహించారు. గత ఐదు నెలలుగా కుటుంబాలను పోషించుకోలేక దయనీయ పరిస్థితులలో గడుపుతున్నామని వాపోయారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పట్టించుకోలేదని ఆవేదన చెందారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ పీటీఎల్యూ ఆధ్వర్యంలో ఉప తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
యర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆందోళన బాటపట్టారు. నల్ల రిబ్బన్లు నోటికి కట్టుకుని, ప్లకార్డులు చేతబట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. గత 6 నెలల నుంచి కరోనా వైరస్ కారణంగా తాము జీవనోపాధి కోల్పోయామని ఆవేదన చెందారు. ఈ మేరకు ప్రభుత్వం స్పందించి ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలని కోరారు. అనంతరం ఎమ్ఈవో, ఎంపీడీవోలకు అర్జీలు అందజేశారు.
ఇదీ చదవండి :