PM modi about vittalacharya in mann ki baat : పుస్తకాలు కేవలం జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా.. మన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. "మన్ కీ బాత్"లో భాగంగా.. పుస్తకాల గొప్పతనం గురించి వివరించే క్రమంలో.. తెలంగాణకు చెందిన విఠలాచార్య గురించి ప్రస్తావించారు మోదీ. యాదాద్రి జిల్లా రామన్నపేటలో విఠలాచార్య ఏర్పాటు చేసిన గ్రంథాలయం, అందు కోసం ఆయన చేసిన కృషిని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. 2021 ఏడాదిలో చివరి, 84వ మనసులో మాట(మన్ కీ బాత్) కార్యక్రమంలో మాట్లాడారు.
విఠలాచార్య గురించి అలా..
మన్‌కీ బాత్‌లో విఠలాచార్య కృషిని ప్రధాని అభినందించారు. మన దేశం ఎందరో ప్రతిభావంతులను ప్రపంచానికి అందజేసిందని... వారి సృజనాత్మకత మిగతా వారందరికీ స్ఫూర్తినిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. కలలను నెరవేర్చుకోవడానికి వయసుతో పట్టింపు లేదనడానికి.... తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని విఠలాచార్యకు చిన్నతనం నుంచి కోరిక ఉండేదని.. కానీ, అప్పట్లో దేశం బ్రిటీషు వారి చేతుల్లో ఉన్న కారణంగా ఆయన కల నెరవేరలేదని ప్రధాని వెల్లడించారు. ఆ తర్వాత అధ్యాపకుడైన విఠలాచార్య.. తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసి ఎన్నో రచనలు చేశారని వివరించారు.
'ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని విఠలాచార్యకు చిన్నతనం నుంచి కోరిక ఉండేది. అప్పట్లో దేశం బ్రిటీషు వారి చేతుల్లో ఉన్న కారణంగా ఆయన కల నెరవేరలేదు. ఆరేడేళ్ల క్రితం ఆయన తన కలను నెరవేర్చుకోవటంపై దృష్టి సారించారు. తాను సేకరించిన అనేక పుస్తకాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆయన జీవితకాలం దాచుకున్న డబ్బునంతా ఖర్చుచేశారు. క్రమంగా ప్రజలంతా ఆయనతో చేతులు కలిపి... గ్రంథాలయ విస్తరణలో భాగస్వాములయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ఉన్న ఈ గ్రంథాలయంలో ప్రస్తుతం 2లక్షల వరకు పుస్తకాలు ఉన్నాయి. చదువుకునేందుకు తాను పడిన కష్టాలు మరెవరూ పడొద్దని విఠలాచార్య ఆకాంక్షించారు.' - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఇదీ చదవండి: CJI visit to amaravathi: అమరావతికి సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ.. స్వాగతం పలికిన రైతులు