Pressures on revenue officers రెవెన్యూ సిబ్బందిపై నేతలు, ప్రజాప్రతినిధుల పెత్తనం పెరుగుతోంది. ఖరీదైన భూమార్పిడి, మ్యుటేషన్, వివాదాస్పద భూములు, నిషిద్ధ జాబితాల నుంచి భూముల తొలగింపు వంటి పనులు చేయాలంటే ముందుగా తమను సంప్రదించాల్సిందేనని ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు తెస్తున్నారు. ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు రెవెన్యూ సిబ్బందిని పావులుగా వాడుకుంటున్నారు. మాట వినని వారిపై కన్నెర్ర చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడ్డ సుమారు 30 మంది తహసీల్దార్లు, ఇతర సిబ్బందిపై రెవెన్యూ శాఖ ఇటీవల చర్యలు తీసుకుంది. ఇందులో ఎక్కువ మంది బలి కావడానికి ప్రత్యక్షంగా/ పరోక్షంగా నేతల ప్రమేయంఉంది. విశాఖపట్నం, ప్రకాశం, వైయస్‌ఆర్, అన్నమయ్య తదితర జిల్లాల్లో నేతల ప్రమేయం ఎక్కువ. ఒత్తిళ్లకు తలొగ్గక తప్పని పరిస్థితులను ఉన్నతాధికారులు కూడా కల్పిస్తున్నారన్న విమర్శలున్నాయి.
భూవిలువలు పెరిగిన విశాఖలో అధికారులకు అంతే స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. గతేడాది విశాఖ గ్రామీణ తహసీల్దార్ నరసింహమూర్తి సస్పెన్షన్ రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నగర శివారు కొమ్మాదిలో రూ.వంద కోట్ల విలువైన 12.26 ఎకరాలను తప్పుడు జనరల్ పవరాఫ్ అటార్నీతో ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు కుమారుడు సుకుమార్‌వర్మకు కట్టబెట్టా లని ప్రయత్నించారు. దీనిపై స్థల యజమానులు రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదునిచ్చారు. తహసీల్దార్‌కూ విన్నపాన్ని ఇచ్చి 1-బీలోని తమ భూమి రిజిస్ట్రేషన్ కాకుండా నిరోధించగలిగారు. దీనిపై నేతల ఒత్తిళ్లు పెరగడంతో చేసేదేమీ లేక 3గంటల్లోనే తహసీల్దార్ తదనుగుణంగా మార్చారు. విచారించిన ఉన్నతాధికారులు విధానపరమైన తప్పిదం దొర్లిందంటూ తహసీల్దార్‌ను సస్పెండ్ చేశారు. ఓ ఎంపీకి సంబంధించిన భూవివాదంలో ఈ రెవెన్యూ కార్యాలయంలోనే పనిచేసిన తహసీల్దార్‌ను ఆకస్మికంగా బదిలీ చేయడమూ చర్చనీయాంశమైంది.
వైయస్‌ఆర్, అన్నమయ్య జిల్లాల్లో...
వైయస్‌ఆర్, అన్నమయ్య జిల్లాల్లో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండడం అక్రమార్కులకు కలిసివస్తోంది. వైయస్‌ఆర్ జిల్లా వీరపునాయునిపల్లె, అన్నమయ్య జిల్లా పుల్లంపేట, రామసముద్రం తహసీల్దార్లు ఈశ్వరయ్య, నరసింహులు, రాములును భూకుంభకోణంలో ఉద్యోగాల నుంచి తొలగిస్తూ సీసీఎల్‌ఏ ఉత్తర్వులిచ్చారు. అన్నమయ్య జిల్లా చిన్నమండ్యం, వైయస్‌ఆర్ జిల్లా బి.మఠం తహసీల్దార్లు నాగేశ్వరరావు, దైవాధీనం సస్పెండయ్యారు. సీకేదిన్నె తహసీల్దారు మహేశ్వరరెడ్డిని సస్పెండ్ చేసి తిరిగి నెలలోనే కీలకమైన మండలానికి బదిలీ చేశారు.
పీలేరు కుంభకోణంలో..
రెవెన్యూ యంత్రాంగం సాయంతో అధికార పార్టీ నేతల్లో పలువురు పీలేరు చుట్టూ ఐదు కి.మీ. పరిధిలో ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు వేశారు. రూ.కోట్ల విలువైన భూఅక్రమాలపై ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టరు హరినారాయణన్ ఆదేశాల మేరకు అప్పటి మదనపల్లె సబ్‌కలెక్టరు జాహ్నవి విచారించారు. పలు గ్రామాల్లో 601.37 ఎకరాల ప్రభుత్వ భూమి, 80 ఎకరాల డీకేటీ భూములు ఆక్రమణల్లో ఉన్నట్లు గుర్తించారు.
మరో 282 ఎకరాల్లో అనధికారికంగా లేఅవుట్లు వేసినట్లు తేల్చారు. అక్రమాల్లో రెవెన్యూ యంత్రాంగం పాత్రను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో 15 మంది సిబ్బందిపై కేసులు నమోదైనా తదుపరి చర్యలు లేవు. కాలవ్యవధిలో సబ్‌కలెక్టరు బదిలీ అయ్యారు. భూఅక్రమార్కులకు వత్తాసు పలికారనే ఆరోపణలపై గతంలో తహసీల్దార్లుగా పనిచేసిన వారిలో కొందరిపై చర్యలకు ఉన్నతాధికారులు సిఫార్సు చేశారు. వీరిని బదిలీ చేయగా.. పలువురు నేతల అండదండలతో స్వల్ప వ్యవధిలోనే తిరిగి యథాస్థానాల్లో విధుల్లో చేరారు.
* దేవాదాయ, వక్ఫ్‌బోర్డు భూములపై కన్నేసిన నేతలు వాటిని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయవాడలో వక్ఫ్‌కు చెందిన 300 ఎకరాల కోసం 64 దరఖాస్తులు వచ్చాయి.
* శ్రీకాళహస్తి, తిరుపతి ప్రాంతాల్లో తన అనుమతి లేనిదే నిషిద్ధ జాబితాలోనుంచి ఏ భూమినీ తొలగించకూడదని ఓ ప్రజాప్రతినిధి హెచ్చరించారు.
* పశ్చిమ కృష్ణా ప్రాంతంలో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూముల కింద మార్చుకునేందుకు దరఖాస్తులొస్తే వెంటనే పనులు చేసి పెట్టవద్దని రెవెన్యూవారికి మౌఖిక ఆదేశాలున్నాయని సమాచారం.
* అనంతపురం జిల్లాలో ఓ మంత్రి చెప్పినట్లు చేయకుంటే రెవెన్యూ సిబ్బంది ఇబ్బందుల్లో పడ్డట్టే. ఒక డిప్యూటీ తహసీల్దార్ ఇన్‌ఛార్జి తహసీల్దార్‌గా ఉంటూ మంత్రి అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
* విజయనగరం జిల్లాలో మ్యుటేషన్లను పరిష్కరించాలంటే స్థానిక నేతల ఆమోదం తప్పనిసరైందని వీఆర్వోల సంఘం నేతలు ఉన్నతాధికారులకు విన్నవించారు.
నాయకులతో కలిసి బ్యాంకాక్‌కు
ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి, ఆయన కుమారుడి ఒత్తిళ్లు రెవెన్యూ అధికారులపై ఎక్కువగా ఉన్నాయి. దీనిపై లోగడ ఒంగోలు తహసీల్దారు ఒకరు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో మరొకరు నియమితులయ్యారు. భూమిలో సింహభాగాన్ని ఆయన ఆన్‌లైన్ చేసినా.. కొద్ది స్థలం విషయంలో పేచీ రావడంతో ప్రజాప్రతినిధి కుమారుడు ఫోన్ చేసి బెదిరించారన్న ఫిర్యాదులున్నాయి. దీంతో ఆ తహసీల్దారు తన ఆవేదనను వాట్సప్ స్టేటస్‌లో పెట్టడం దుమారం రేపింది. మరో సంఘటనలో దొనకొండకు బదిలీ అయిన డీటీ రవిశంకర్ పట్టుబట్టి కొద్ది రోజుల్లోనే దర్శికి వెళ్లిపోయారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా స్థానిక వ్యాపారులు, వైకాపా నాయకులతో కలిసి బ్యాంకాక్ వెళ్లారు. ఆయన ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. మార్కాపురంలో గ్రేడ్1 వీఆర్వో ఒకరు నెలలో మూడుసార్లు బదిలీ అయ్యారు.
ఇవీ చదవండి: