రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో 71వ గణతంత్ర వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 14 శకటాలతో ప్రభుత్వం అందించే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
తొలిసారిగా తెలంగాణ పోలీసులు
గణతంత్ర కవాతులో సైన్యం, సీఆర్పీఎఫ్, తొలిసారిగా తెలంగాణ పోలీసులు, ఏపీఎస్పీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఎన్సీసీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు, రెడ్ క్రాస్ బృందాలు పాల్గొంటున్నాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో పాటు పరిమితికి లోబడి ప్రజలను గ్యాలరీలలోకి అనుమతిస్తారు. ప్రముఖులు, మంత్రులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు, అతిథులు, స్వాతంత్ర్య సమరయోధులు, పద్మ అవార్డు గ్రహీతలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు వేడుకలు వీక్షించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
వేడుకలను తిలకించేందుకు భారీ తెరలు ఏర్పాటు చేశారు. సుమారు 16 వేల మంది ప్రజలు ఈ వేడుకలను తిలకించేందుకు వీలుగా మైదానంలో సౌకర్యాలు కల్పించారు. ఈ ఏర్పాట్లను ఉన్నతాధికారులు పరిశీలించారు. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు
ఇదీ చదవండీ...