High Court: సమ్మె చేస్తామంటున్న ప్రభుత్వ ఉద్యోగులు కొవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. పీఆర్సీ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసును సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపి ఈ నెల 10కి వాయిదా వేసింది. పెన్‌డౌన్ చేయడం సమ్మె కాదని తెలిపింది. ఉద్యోగులు తర్వాత ఏం చేస్తారో వేచి చూద్దామంది. వారి వాదనలూ వినాలని అభిప్రాయపడింది. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఏజీ ఎస్.శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రభుత్వం నియంత్రిస్తుందని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ కె.మన్మథరావుతో కూడిన ధర్మాసనం వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపి ఈనెల 10కి వాయిదా వేసింది.
సమ్మె నోటీసును రాజ్యాంగ, చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ విశాఖకు చెందిన విశ్రాంత ప్రొఫెసర్ ఎన్.సాంబశివరావు హైకోర్టులో పిల్ దాఖలుచేశారు. దీనిపై న్యాయవాది అభ్యర్థన మేరకు హైకోర్టు శుక్రవారం అత్యవసరంగా విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ వాదనలు వినిపించారు. ‘పోరాటం పేరుతో ప్రభుత్వాన్ని ఉద్యోగులు సవాలు చేస్తున్నారు. ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి పీఆర్సీకి నిరసనగా ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినా మొండి వైఖరి అవలంబిస్తున్నారు. కొవిడ్ పరిస్థితుల్లో చలో విజయవాడ పేరుతో భారీ సంఖ్యలో ఉద్యోగులు ఒకచోట చేరారు. సమ్మెకు సిద్ధపడుతున్న ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు’ అని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ ప్రస్తుతం సమ్మె చేయడం లేదు కదా అని ప్రశ్నించింది. పెన్‌డౌన్ మొదలుపెట్టారని న్యాయవాది చెప్పగా.. అది సమ్మె కాదని వ్యాఖ్యానించింది.
సమ్మె చట్టవిరుద్ధమని సుప్రీం చెప్పింది: ఏజీ
అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ‘చలో విజయవాడకు అనుమతి ఇవ్వలేదు. 5వేల మంది చేరేందుకు స్థలమున్నచోట 35-40వేల వరకు వచ్చారు. చర్చలకు తలుపులు తెరిచే ఉన్నా ఉద్యోగులు స్పందించడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడం సర్వీసు నిబంధనలకు, చట్ట విరుద్ధమని టీకే రంగరాజన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సమ్మె చేసేవారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది’ అని తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ సమ్మెకు వెళ్లకుండా నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ఉద్యోగులు తర్వాత ఏమి చేయబోతున్నారో తెలియకుండా స్పందించలేమని, వారి వాదనలూ వినాలని ధర్మాసనం అభిప్రాయపడింది. భేషజాలకు పోకుండా సమస్యలను పరిష్కరించుకోవాలని వ్యాఖ్యానించింది.
ఇదీ చదవండి: హెచ్‌ఆర్‌ఏపై ప్రభుత్వ ప్రతిపాదనలు.. ఉద్యోగ సంఘాలతో కొనసాగుతున్న చర్చలు