Telangana Rain Updates : కుంభవృష్టి వానలు ఆగడం లేదు. రాష్ట్రంలో బుధ, గురువారాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున వీటి ప్రభావంతో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొద్దిగంటల్లోనే కారుమేఘాలేర్పడి భారీవర్షాలు కురుస్తాయని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Telangana Weather Updates : రాష్ట్రంలో మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు 50 ప్రాంతాల్లో ఒక్కోచోట 10 సెంటీమీటర్లకు పైగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా జైనూరు గ్రామం (కుమురం భీం)లో 17.9 సెం.మీ., ఆమకొండ (కరీంనగర్)లో 17.8, కనుకుల (పెద్దపల్లి)లో 17.7, ఆదిలాబాద్ జిల్లా హీరాపూర్‌లో 16.8, పిప్పల్‌ధరిలో 15.6, వెదురుగట్టు (కరీంనగర్)లో 15.4, గుళ్లకొండ (జగిత్యాల)లో 15.4, చెల్పూరు(జయశంకర్)లో 14.2, పెంబి (నిర్మల్)లో 14.3 సెం.మీ. వర్షం కురిసింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకూ ముసురుపట్టి వర్షం కురుస్తూనే ఉండటంతో చలి వాతావరణమేర్పడింది. నల్గొండలో సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రత 25.7 డిగ్రీలైతే 20.4 డిగ్రీలే నమోదైంది.
ఒడిశా.. ఉత్తరాంధ్రల మీదుగా.. ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం మంగళవారం మరింత తీవ్రంగా మారింది, దీనికి అనుబంధంగా సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఇది నైరుతి దిశ వైపు వంపు తిరిగి ఉంది. మరోవైపు తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల నడుమ గాలుల్లో అస్థిరత కొనసాగుతున్నందున మరో ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉత్తర భారతమంతా వ్యాపించింది. ఇది దక్షిణ భారతం వైపు వంపు తిరిగి ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.
రుతుపవన గాలుల ద్రోణి రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి రాయ్‌పుర్ మీదుగా బంగాళాఖాతం వరకు 1500 మీటర్ల ఎత్తున వ్యాపించింది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున వీటి ప్రభావంతో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చల్లని వాతావరణంతో విద్యుత్తు వినియోగం బాగా తగ్గిపోయింది. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో రాష్ట్ర విద్యుత్ గరిష్ఠ డిమాండు 5755 మెగావాట్లకు తగ్గిపోయింది. గత ఏడాది ఇదే రోజు(2021 జులై 12) ఇదే సమయంలో 6487 మెగావాట్లుంది.
ఇదీ చదవండి :