ప్రభుత్వం అప్పులు పుట్టించేందుకు అనుసరిస్తున్న విధానాలు గత కొన్నాళ్లుగా వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రూ.8,300 కోట్ల రుణ వ్యవహారమూ దుమారం రేపుతోంది. ఇప్పటికే ఈ అంశం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ముందు ఉంది. సంబంధిత పార్టీలకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసు జూన్ 15న విచారణకు రావాల్సి ఉంది. ఈ వ్యవహారంలో అనేక రాజ్యాంగబద్ధమైన అంశాలు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న విషయాలు, కార్పొరేషన్ జారీ చేసిన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు ఎంతవరకు చెల్లుబాటు అవుతాయి.. వంటి అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి.
రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు, ఆ సంస్థ ద్వారా రుణాలు తీసుకున్న విధానం కూడా వివాదమైంది. ఈ కార్పొరేషన్‌కు ఎస్‌బీఐ ఇవ్వాల్సిన దాదాపు రూ.1,800 కోట్ల రుణం పెండింగ్‌లోనే ఉంది. దాంతో ఈ రుణం ఇచ్చేలా చూడాలని ప్రధానికి రాసిన లేఖలో ముఖ్యమంత్రి జగన్ కోరాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్‌కు రావాల్సిన నిధిని తగ్గించుకుని ఆ మొత్తాన్ని పరోక్షంగా బేవరేజస్ కార్పొరేషన్‌కు మళ్లించడం మరో వివాదానికి తెరతీసింది. ఈ విధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ, ఇతర సంస్థలు తప్పుబట్టినందున ఈ కార్పొరేషన్‌కు ఆదాయం చూపించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందుకు చట్ట సవరణ చేసి కార్పొరేషన్ ప్రత్యేక మార్జిన్ వసూలు చేసుకునే అధికారాన్ని కల్పించారు. ఆ ఆదాయాన్ని ఆసరాగా చూపించి అప్పు తీసుకునే ఏర్పాట్లు చేశారు.
మరో పక్క ఈ వ్యవహారానికి సంబంధించి నిపుణులు అనేక మౌలిక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రతి ఏటా మద్యంపై బ్రాండును బట్టి 500 శాతం వరకు పన్ను విధించి ఆదాయం రాబడుతున్నారు. ఈ రూపేణా వచ్చే ఆదాయం ప్రతి ఏటా రూ.600 కోట్ల నుంచి రూ.800 కోట్లు ఉంటుందని అంచనా. ఇప్పుడు 9/2022 చట్ట సవరణ ద్వారా 100శాతం ఆదాయం బేవరేజస్ కార్పొరేషన్‌కు మళ్లించే ఏర్పాటు చేశారనేది విమర్శ. ఇక్కడ పన్ను తగ్గించి అంతే మొత్తానికి దాదాపు కార్పొరేషన్ ప్రత్యేక మార్జిన్ వసూలు చేసుకునేందుకు చట్టంలో వెసులుబాటు కల్పించారు.
నిపుణులు ఏమంటున్నారంటే..
- మద్యం రాష్ట్ర జాబితాలోని అంశం. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలులో ఉంది.
- అందులోని 58(ఏ) అంశం ప్రకారం మద్యంపై ఏ రూపేణా, ఏ పేరుతో పన్ను విధించినా ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. తద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా రాష్ట్ర ఖజానాకే రావాలి.
- రాష్ట్ర ఖజానా నుంచి పైసా బయటకు తీయాలన్నా కార్యనిర్వాహకవర్గానికి అవసరమైన ఆమోదాన్ని రాష్ట్ర చట్టసభలు ఇవ్వాల్సిందే. బడ్జెట్ అప్రాప్రియేషన్ బిల్లు ఆమోదించి ఆ నిధి ఖర్చు చేసుకునేందుకు చట్టసభలు ముందే దానిని ఆమోదించాల్సి ఉంటుంది. అది కూడా ఏడాదికి సంబంధించిన ఖర్చు మాత్రమే ఆమోదించేందుకు ఆస్కారం ఉంది. అంతకు మించిన సమయానికి ఖర్చులు ఆమోదించే అధికారం రాజ్యాంగం కల్పించలేదు.
- ఒక వేళ మార్చి 31 లోపు ఆ సొమ్ములు ఖర్చు చేయకపోతే అవి మురిగిపోతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 202 ప్రకారం మళ్లీ మరుసటి ఏడాదికి బడ్జెట్ ఆమోదించాలి.
- మద్యం విషయంలో బేవరేజస్ కార్పొరేషన్‌కు దఖలు చేసే అధికారం చట్టసభలకు ఎంతవరకు ఉందనేది చర్చనీయాంశమవుతోంది. ఈ విషయాన్ని న్యాయస్థానాల్లో ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్ చేశారు.
- భవిష్యత్తు ఆదాయాలను తాకట్టు పెట్టేందుకు వీలు లేదని కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఏపీఎస్‌డీసీ వ్యవహారంలో తప్పుపట్టింది. అలాంటిది బేవరేజస్ కార్పొరేషన్ అప్పుల విధానం ఎంతవరకు చెల్లుబాటు అవుతుందనేది వేచిచూడాలని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇవీ చూడండి: