Police took Tony into custody: మాదక ద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు టోనీని హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టోనీని పోలీసులు 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. పంజాగుట్ట పీఎస్కు తరలించి టోనీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ప్రముఖులకు డ్రగ్స్ సప్లై..
నైజీరియాకు చెందిన టోనీ 2013 నుంచి ముంబయిలో అక్రమంగా నివాసం ఉంటున్నాడు. గత రెండున్నరేళ్లుగా హైదరాబాద్లోని పలువురు వ్యాపారులకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ముంబయిలో ఏజెంట్లను నియమించుకొని వాళ్ల ద్వారా ముంబయి, హైదరాబాద్, గోవా, బెంగళూర్, చెన్నైకి టోనీ మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టోనీ ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్లో 13 మందిపై కేసు నమోదు చేసి అందులో 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో నలుగురు వ్యాపారవేత్తలు పరారీలో ఉన్నారు. వీళ్లంతా కూడా టోనీ నుంచి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
మరిన్ని వివరాల కోసం..
వీళ్లే కాకుండా మరికొంత మంది టోనీ నుంచి మాదక ద్రవ్యాలు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని ప్రశ్నించడం ద్వారా దందాకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. టోనీ జాబితాలో రాజకీయ, సినీ రంగానికి చెందిన వాళ్లెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి: MURDER: ముద్దాడపేటలో దారుణం... భార్య, సోదరిని చంపి వ్యక్తి ఆత్మహత్యాయత్నం