Jubilee hills gang rape case updates : సంచలనం రేకెత్తించిన జూబ్లీహిల్స్‌లో బాలిక సామూహిక అత్యాచార ఘటనపై మరింత స్పష్టతకోసం పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. మే 28న జూబ్లీహిల్స్ పబ్‌లో బాలికను ట్రాప్ చేసిన నిందితులు పక్కా పథకం ప్రకారం కారులో తీసుకెళ్లి నిర్జన ప్రదేశంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ నెల 31న ఈ ఘటన వెలుగు చూసింది. తర్వాత మూడు రోజులపాటు ఆరుగురు నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రోజుకో ప్రాంతం మారుతూ మొబైల్ ఫోన్లు, సిమ్‌కార్డులు మారుస్తూ పోలీసులను ఏమార్చారు.
ఈ వ్యవహారంలో నిందితులను తప్పించేందుకు తెర వెనుక సహకరించిన పెద్దలు ఎవరనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. జూబ్లీహిల్స్ పోలీసుల కస్టడీలో ఉన్న సాదుద్దీన్ మాలిక్(18)ను శుక్రవారం బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ సుమారు అర గంట ప్రశ్నించారు. బెంజ్‌కారు నుంచి ఇన్నోవా కారులోకి బాలికను మార్చటానికి గల కారణాల గురించి ప్రధానంగా ఆరా తీశారు. తప్పించుకు పారిపోయిన నిందితులు మూడు రోజులు ఎక్కడున్నారు? నిందితులను అప్రమత్తం చేస్తూ వచ్చింది ఎవరు? అనే వివరాలు రాబట్టే దిశగా ఆయన విచారణ సాగినట్టు సమాచారం. దీనికి నిందితుడు పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది.
వీడియో తీసింది ఎవరు.. మైనర్లను ప్రశ్నించిన పోలీసులు.. ఇదే ఘటనలో నిందితులైన ముగ్గురు మైనర్లను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జువెనైల్ న్యాయస్థానం ఆదేశాల ప్రకారం అయిదు రోజుల కస్టడీలో భాగంగా తొలిరోజు జువెనైల్ హోంలోని ప్రత్యేక గదిలో మామూలు దుస్తుల్లోనే పోలీసులు ప్రశ్నించారు. కొద్ది సమయం ముగ్గుర్నీ ఒకేసారి, తరువాత వేర్వేరుగా విచారించారు. బెంజ్, ఇన్నోవా కార్లలో జరిగిన ఉదంతాన్ని వీడియోలో చిత్రీకరించింది ఎవరు? సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిందెవరు? అనే వివరాలు సేకరించారు. వీడియోలు, ఫొటోలను ముందుగా ఎవరికి పంపారనే దానిపైనా ఆరా తీశారు. పోలీసులు ప్రశ్నించే సమయంలో వారంతా దిక్కులు చూస్తూ కూర్చున్నట్లు తెలుస్తోంది. అత్యాచారానికి పథకం ఎవరిది? పార్టీకి ఆహ్వానించిందెవరు? వేడుక ముగిశాక ఏం జరిగింది? తదితర వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించి విఫలమయ్యారు.
ఎమ్మెల్యే కుమారుడు సహా ఇద్దరి కస్టడీకి న్యాయస్థానం అనుమతి.. వీరు ముగ్గురితో పాటు ఈ నేరంలో భాగస్వాములైన మరో ఇద్దరు మైనర్లనూ కస్టడీకి ఇస్తూ జువెనైల్ న్యాయస్థానం శుక్రవారం సాయంత్రం తీర్పు వెలువరించింది. దీంతో ఆరుగుర్నీ శనివారం నుంచి పోలీసులు జూబ్లీహిల్స్ ఠాణాలో విచారించనున్నారు. ఈ ఇద్దరిలో ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడు. ఈ ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ (ఎన్‌సీపీసీఆర్) తాజాగా నివేదిక కోరింది.
బాలిక మెడచుట్టూ పంటిగాట్లు.. జూబ్లీహిల్స్‌లో సామూహిక అత్యాచారానికి పాల్పడిన బాలిక వైద్య నివేదిక పోలీసులకు అందినట్లు తెలుస్తోంది. బాలిక మెడ చుట్టూ దాదాపు ఏడెనిమిదిచోట్ల పంటితో కొరికిన గుర్తులతోపాటు చుట్టూ గోళ్లతో రక్కిన ఆనవాళ్లు ఉన్నట్లు నివేదికలో స్పష్టమైంది. దీంతోపాటు శరీరంపై చాలా ప్రాంతాల్లో గోళ్లతో రక్కిన గాయాలున్నాయని నివేదికలో వైద్యులు తేల్చినట్టు సమాచారం. లైంగిక దాడికి పాల్పడే క్రమంలో బాలిక ప్రతిఘటించడంతో వారు ఇలా దారుణంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇన్నోవా వాహనంలో అత్యాచారం చేసిన సమయంలో ఉన్న ఆధారాలు కొన్నింటిని ఫోరెన్సిక్ బృందం స్వాధీనం చేసుకుంది. ఆయా ఆధారాలకు సంబంధించిన నివేదికలు ఇంకా రావాల్సిఉంది. మరోవైపు కస్టడీలో ఉన్న ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ విచారణలో ఆశించిన మేరకు సమాచారం ఇవ్వకపోవడంతో మరింత లోతుగా విచారించాలని పోలీసు భావిస్తున్నారు.
ఇదీ చదవండి :
జూబ్లీహిల్స్‌లో బాలికపై గ్యాంగ్ రేప్.. ఐదుగురు నిందితులు అరెస్టు
Jubilee hills case: మైనర్లకు ఐదు రోజుల కస్టడీ.. అతని సమక్షంలోనే వాంగ్మూలం
Jubilee hills Gang Rape Case: సూత్రధారి కార్పొరేటర్ కుమారుడే